
ఓసీపీలో ఉద్రిక్తత
శ్రీరాంపూర్: వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శ్రీరాంపూర్ ఓసీపీలో ఓబీ కాంట్రాక్టు కార్మికులు శనివారం ఆందోళనను ఉధృతం చేశారు. బొగ్గు ఉత్పత్తిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీరాంపూర్ ఓసీపీలో ఓబీ పనులు నిర్వహించే సీఆర్‌ఆర్ సంస్థ నెలన్నర క్రితం పనులు నిలిపివేసింది. నాలుగు నెలల వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు క్వారీలోకి దిగి వాహనాలను అడ్డుకున్నా రు. అనంతరం ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అక్కడే టెంటు వేసుకుని భోజ నాలు చేసి రాత్రి వరకు ఆందోళన కొనసాగించారు.
అధికారులపై ఆగ్రహం..
కాంట్రాక్ట్ కార్మికులతో శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్, ఎస్‌వోటు జీఎం సత్యనారాయణ, ఏజెంట్ రాజేందర్, ఓసీపీ పీఓ వెంకటేశ్వర్లు, మేనేజర్ ఐ.శ్రీనివాస్ ఇతర అధికారులు చర్చించారు. కంపెనీ పరిధిలోని చర్యలన్నీ తీసుకుంటున్నామని చెప్పినా కార్మికులు వినలేదు. జీఎంను ఘెరావ్ చేసి రోడ్డుపైనే నిర్బంధించారు. నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్ తమను ఇబ్బందులకు గురి చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతనాలపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదంటూ రాత్రి వరకు అధికారులను ఎటూ కదలనీయకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురు కార్మికులు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. కంపెనీ జీపు కమాన్ బయటకు వెళ్లడానికి ప్రయత్నించగా కార్మికులు దాడికి యత్నించారు. శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కంపెనీ సెక్యూరిటీ గార్డులను పెద్దయెత్తున మొహరించారు.
కాంట్రాక్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు
జీతాలు ఇవ్వకుండా మోసం చేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కంపెనీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని కార్మికులు పట్టుబట్టారు. దీంతో ఓసీపీ పీఓ పేరుతో సదరు కాంట్రాక్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఆర్‌ఆర్ సంస్థ కాంట్రాక్ట్ కార్మికులు ఐత కిష్టయ్య, జెట్టి రమేశ్, పెద్దపల్లి సురేశ్, జక్కుల రాజలింగు, సిరిపురం శ్రీను, సన్నిగౌడ్, బొడ్డు తిరుపతి, తోట రాజేశ్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగింది.