● జిల్లాలో 892మంది వ్యాధిగ్రస్తులు ● ట్రాన్స్‌మిషన్‌ అసెస్‌మెంటు సర్వే(టాస్‌)కు జిల్లా ఎంపిక ● 20ఏళ్లు పైబడిన వారికి రక్త పరీక్షలు ● జిల్లా వ్యాప్తంగా 20బృందాలు ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

● జిల్లాలో 892మంది వ్యాధిగ్రస్తులు ● ట్రాన్స్‌మిషన్‌ అసెస్‌మెంటు సర్వే(టాస్‌)కు జిల్లా ఎంపిక ● 20ఏళ్లు పైబడిన వారికి రక్త పరీక్షలు ● జిల్లా వ్యాప్తంగా 20బృందాలు ఏర్పాటు

Oct 11 2025 5:50 AM | Updated on Oct 11 2025 6:36 AM

● జిల్లాలో 892మంది వ్యాధిగ్రస్తులు ● ట్రాన్స్‌మిషన్‌ అసెస్‌మెంటు సర్వే(టాస్‌)కు జిల్లా ఎంపిక ● 20ఏళ్లు పైబడిన వారికి రక్త పరీక్షలు ● జిల్లా వ్యాప్తంగా 20బృందాలు ఏర్పాటు

మంచిర్యాలటౌన్‌: జిల్లాలో బోదకాలు(ఫైలేరియా) కేసులు ఎక్కువగా నమోదు అవుతుండడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ట్రాన్స్‌మిషన్‌ అసెస్‌మెంటు సర్వే(టాస్‌)లో భాగంగా జిల్లాలో ఎక్కువగా ఫైలేరియా కేసులు నమోదవుతున్న ప్రాంతంలో ప్రజలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. ఈ నెల 13నుంచి 22వరకు రక్త పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 20ఏళ్లు పైబడిన వారిని సర్వే చేసి అనుమానితుల నుంచి రక్తనమూనాలు సేకరిస్తారు. వ్యాధి నిర్ధారణ కోసం ఇప్పటికే సిద్ధం చేసిన కిట్లపై ల్యాబ్‌ టెక్నీషియన్లకు ఇటీవల ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. జిల్లాలో ప్రతియేటా బోదకాలుపై సర్వే చేసి గుర్తించిన వారికి మందులు, చికిత్స అందిస్తున్నారు. అయినా కేసులు అదుపులోకి రావడం లేదు. దీంతో కేసులు నమోదవుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి అక్కడి వారిలోని కొందరికి ర్యాండమ్‌గా పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం వ్యాధి బారిన పడ్డ వారికి చికిత్స అందిస్తూనే 2030నాటికి జిల్లాలో బోదకాలు అనేది లేకుండా చేయాలని, ఫైలేరియా నియంత్రణే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ నెల 7న కేంద్ర కీటక జనిత వ్యాధుల అడిషనల్‌ డైరెక్టర్‌(రీజినల్‌) డాక్టర్‌ అనురాధ జిల్లాలోని వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, ల్యాబ్‌టెక్నీషియన్లు, ఆశ, ఆరోగ్య కార్యకర్తలకు అవగాహన కల్పించారు.

20బృందాలతో ఇంటింటికి..

బోదకాలు వ్యాధి నిర్ధారణ అయిన గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లోని 20ఏళ్లు పైబడిన వారిలో ఫైలేరియా ఉందో లేదో తెలుసుకునేందుకు 20 బృందాలు సర్వే చేయనున్నాయి. వ్యాధి నిర్ధారణ కిట్లు ఇప్పటికే వైద్య సిబ్బందికి అందించగా.. వ్యాధి నిర్ధారణ త్వరగా చేసి మందులు, అవసరం మేరకు మెరుగైన వైద్యం కోసం సదుపాయాలు ఉన్న ఆస్పత్రులకు రెఫర్‌ చేయనున్నారు. దోమకాటు ద్వారా వ్యాప్తిచెందే ఈ వ్యాధి ప్రస్తుతం ఎవరిలో ఉందో గుర్తించి చికిత్స, మందులు అందించడం, వ్యాధిని గుర్తించిన ప్రాంతంలో ఇతరులకు వ్యాధి సోకకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోనున్నారు. గతంలో సర్వే చేసినా అనుమానితుల నమూనాలు మాత్రమే సేకరించేవారు. కానీ ఈ ఏడాది బోదకాలు వ్యాధి సోకిన ప్రాంతంలోని ప్రతీ ఒక్కరికి వైద్య పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేశారు.

చికిత్స, మందులతో నివారణ

ఫైలేరియా వ్యాధితో బాధపడుతున్న వారికి క్యూలెక్స్‌ దోమ కుట్టి ఇతరులను కుట్టడం వల్ల వ్యాధి సోకుతుంది. బాధితుల కాళ్లు పెద్దగా వాపు వచ్చి నడవలేని స్థితిలో బాధపడుతుంటారు. వారి పనులను కూడా చేసుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. పురుషుల్లోని కొందరికి కాళ్లవాపులు కాకుండా వృషణాల్లో వాపు వచ్చి బోదకాల వ్యాధికి గురయ్యే అవకాశాలున్నాయి. ఈ వ్యాధి సోకినప్పుడు కాళ్లు, చేతులు, రొమ్ము, వృషణాల్లో ఏదో ఒక చోట పరిమితికి మించిన వాపు కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారి కాళ్లు, చేతులు స్పర్శను కోల్పోయి పరిమితికి మించిన వాపు పెరగడం వల్ల కదిలించే పరిస్థితి ఉండదు. దీంతో వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు గాను రెండేళ్లకు పైబడిన వారందరికీ ప్రతియేటా మందులు పంపిణీ చేస్తున్నారు. బోదకాల వ్యాధి రాకుండా ఉండేందుకు డీఈసీ మాత్రలు(100ఎంజీ), ఆల్బెండజోల్‌ 400 ఎంజీ మాత్రలు ఇస్తారు.

పీహెచ్‌సీల వారీగా నమోదైన కేసులు

జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీ) పరిధిలో 892మంది బోదకాలు వ్యాధిగ్రస్తులు ఉన్నారు. జన్నారం పీహెచ్‌సీలో 269, తాళ్లపేట్‌ 14, దండేపల్లి 99, వెంకట్రావ్‌పేట్‌ 64, హాజీపూర్‌ 50, మందమర్రి 60, కాసిపేట 47, జైపూర్‌ 25, కుందారం 5, నస్పూర్‌ 10, భీమిని 66, అంగ్రాజ్‌పల్లి 5, కోటపల్లి 2, వేమనపల్లి 5, తాళ్లగురిజాల 47, నెన్నెల 29, పాతమంచిర్యాల యూపీహెచ్‌సీలో 19, రాజీవ్‌నగర్‌ 14, దీపక్‌నగర్‌ 14, శంశీర్‌నగర్‌ 16 కేసులు ఉన్నాయి.

● జిల్లాలో 892మంది వ్యాధిగ్రస్తులు ● ట్రాన్స్‌మిషన్‌ అస1
1/2

● జిల్లాలో 892మంది వ్యాధిగ్రస్తులు ● ట్రాన్స్‌మిషన్‌ అస

● జిల్లాలో 892మంది వ్యాధిగ్రస్తులు ● ట్రాన్స్‌మిషన్‌ అస2
2/2

● జిల్లాలో 892మంది వ్యాధిగ్రస్తులు ● ట్రాన్స్‌మిషన్‌ అస

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement