అభివృద్ధి పనుల్లో అలసత్వం ఉపేక్షించం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనుల్లో అలసత్వం ఉపేక్షించం

Apr 20 2025 1:55 AM | Updated on Apr 20 2025 1:55 AM

అభివృద్ధి పనుల్లో అలసత్వం ఉపేక్షించం

అభివృద్ధి పనుల్లో అలసత్వం ఉపేక్షించం

● నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లపై చర్యలు ● త్వరలో అంగన్వాడీలలో ఖాళీల భర్తీ ● రాష్ట్ర మంత్రి సీతక్క ● ఉమ్మడి జిల్లా పంచాయతీరాజ్‌, మిషన్‌ భగీరథ, సీ్త్ర శిశు సంక్షేమ శాఖలపై సమీక్ష ● అభివృద్ధి పనుల తీరుపై ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల అసంతృప్తి

నిర్మల్‌చైన్‌గేట్‌: ‘అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యానికి తావులేదు.. పనులు చేయడంలో అలసత్వం వహించేవారిని ఉపేక్షించేది లేదు.. పనులను నిర్ణీత గడువులోపు నాణ్యతతో పూర్తి చేయించాలి’ అని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణనీటి సరఫరా, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అధికారులను ఆదేశించారు. నిర్మల్‌ కలెక్టరేట్‌లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అభివృద్ధి పనులపై శనివారం ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టెండర్‌ దశ నుంచే పనులు వేగవంతం చేసి, వర్షాకాలానికి ముందు పనులు పూర్తిచేయాలన్నారు. ఆలస్యం చేస్తున్న గుత్తేదారులకు నోటీసులు జారీ చేసి, పనులు పూర్తి చేయించాలని సూచించారు. త్వరలో అంగన్‌వాడీల్లో టీచర్లు, ఆయాల ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. మినీ అంగన్‌వాడీలను అప్‌గ్రేడ్‌ చేస్తామని, సీనియర్‌ సిటిజన్‌ డే కేర్‌ సెంటర్లు, ట్రాన్స్‌జెండర్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అభివృద్ధి పనుల తీరుపై ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

మహిళా సంఘాలకు చెక్కులు..

మహిళా సంఘాలకు, మెప్మాలకు మంజూరైన చెక్కులను కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపిణీ చేశారు. బ్యాంకు లింకేజీ, రుణాల మంజూరు, వసూలులో నిర్మల్‌ జిల్లా ప్రగతిని మంత్రి ప్రశంసించారు. ఈ సమావేశంలో ఎంపీ గోడం నగేష్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌, ముధోల్‌, ఖానాపూర్‌, సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, బోథ్‌ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, పాయల్‌ శంకర్‌, పవార్‌ రామారావు పటేల్‌, వెడ్మా బొజ్జు పటేల్‌, పాల్వాయి హరీశ్‌బాబు, కోవ లక్ష్మి, అనిల్‌ జాదవ్‌, ఎమ్మెల్సీ దండే విఠల్‌, ఐసీడీఎస్‌ సెక్రెటరీ అనితా రామచంద్రన్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లా కలెక్టర్లు కుమార్‌ దీపక్‌, అభిలాష అభినవ్‌, ఐటీడీఏ పీవో కుష్బూగుప్తా, అదనపు కలెక్టర్లు ఫైజాన్‌ అహ్మద్‌, కిషోర్‌ కుమార్‌, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న మంత్రి సీతక్క, ఎంపీ, ఎమ్మెల్యేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement