ఉరి శిక్ష అమలు చేయాలి!
● దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పేలుళ్ల మృతుల కుటుంబ సభ్యులు, క్షతగాత్రులు ● హైకోర్టు తీర్పుపై హర్షం ● పేలుళ్లలో అప్పట్లో ఇద్దరు మృతి ● మరో ఇద్దరికి గాయాలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల ఘటనలో నిందితులకు హైకో ర్టు ఉరి శిక్ష ఖరారు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. ఉరి శిక్షను అమలు చేయాలని నాటి పేలుళ్ల ఘటనలో మృతుల కుటుంబ సభ్యులు, క్షతగాత్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 2013 ఫిబ్రవరి 21న హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో 16మంది మృతిచెందిన విషయం తెలిసిందే. మృతుల్లో హాజీపూర్ మండలం నంనూర్ గ్రా మానికి చెందిన ఒడ్డె దేవక్క, లచ్చయ్య దంపతుల కుమారుడు ఒడ్డె విజయ్‌కుమార్(23), ముత్యాల పద్మ, పోచయ్య దంపతుల కుమారు డు ముత్యాల రాజశేఖర్(24) ఉన్నారు. బాంబు పేలుళ్లలో ముత్యాల రంజిత్, ఇత్తినేని మహేశ్ తీవ్రంగా గాయపడి కోలుకున్నారు. మృతులు, క్షతగాత్రులు అంతా వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారే. ఉన్న త చదువుల కోసం హైదరాబాద్ వెళ్లి బాంబు పేలుళ్లలో చిక్కుకున్నారు. పేలుళ్లకు కారణమైన ఐదుగురు నిందితులకు హైకోర్టు ఉరి శిక్ష ఖరారు చేస్తూ మంగళవారం తీర్పునివ్వడంతో మృతుల కుటుంబ సభ్యులు, ఘటనలో గాయపడిన వారు సంతోషం వ్యక్తం చేశారు.
ఇదే ఘనమైన నివాళి..
దిల్‌సుఖ్‌నగర్ బాంబుపేలుళ్ల కేసులో హైకోర్టు తీర్పు మా కుమారుడి మృతికి ఘనమైన నివాళి ఇది. ఇన్నాళ్లు మానని గాయంగా ఉన్న ఘటనకు కోర్టు తీర్పుతో న్యాయం జరిగింది. పన్నెండేళ్ల తర్వాత వచ్చిన తీర్పుతో సంతోషంగా ఉంది. వెంటనే నిందితులకు ఉరి శిక్ష అమలు చేయాలి. ప్రభుత్వం కూడా ఇంకా ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి. కోర్టు తీర్పుతో కుమారుడి ఆత్మకు శాంతి లభిస్తుంది.
– ముత్యాల రాజశేఖర్ తల్లిదండ్రులు పద్మ, పోచయ్య, కుటుంబ సభ్యులు
కోర్టు తీర్పుతో న్యాయం..
బాంబు పేలుళ్ల కేసులో నిందితులకు ఉరిశిక్ష పడడంతో న్యాయం లభించింది. ఎంతోమంది మృత్యువాతకు గురికాకా వందల సంఖ్యలో గాయాల పాలయ్యారు. కష్టపడి చదువు పూర్తి చేసినా ఉద్యోగం చేయలేక ఇంటి దగ్గర వ్యవసాయ పనులు చేసుకుంటున్నాను. ఇక దిల్‌సుఖ్‌నగర్ బాంబ్ ఘటన అందరికీ జీవితంలో ఎప్పటికీ మరవలేని చేదు జ్ఞాపకమే. 12 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు కోర్టు నిందితులకు ఉరిశిక్ష విధించి మృతుల, బాధిత కుటుంబాలతోపాటు మాలాంటి వారిలో ఒక తెలియని అనుభూతికి గురి చేసింది.
– ఇత్తినేని మహేశ్, నంనూర్, హాజీపూర్
ఆనందంగా ఉంది..
12ఏళ్ల నాటి చేదు ఘటనకు న్యాయం లభించింది. బాంబు పేలుళ్లతో ఒళ్లంతా గాయాలై పడి ఉండగా ఆస్పత్రిలో చేర్పించారు. ఏడాదిపాటు చికిత్స పొందాను. ఇప్పటికీ ఇంకా నా శరీరంలో కుట్లు, అక్కడక్కడ గాయాలు ఉంటూ ఎప్పుడు ఆ ఘటనను గుర్తు చేస్తూ ఉంటాయి. చదువు పూర్తి చేసినా గాయాల బాధతో చేసేది లేక చదువులకు స్వస్తి పలికి టెంట్‌హౌజ్‌తో కుటుంబ పోషణలో ఉన్నాను. ఇప్పుడు ఆ నిందితులందరికీ కూడా కోర్టు ఉరిశిక్ష విధించడంతో కొంత ఊరట దక్కింది.
– ముత్యాల రంజిత్,
గ్రామం: నంనూర్, మం: హాజీపూర్
ఉరి శిక్ష అమలు చేయాలి!
ఉరి శిక్ష అమలు చేయాలి!


