బెల్లంపల్లి: బెల్లంపల్లిలోని ఓ దుకాణంలో దొంగతనానికి పాల్పడిన భార్యాభర్తలకు జైలు శిక్ష పడింది. వన్‌టౌన్ ఎస్‌హెచ్‌ఓ ఎన్.దేవయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లంపల్లి పోస్టాఫీసు బస్తీకి చెందిన అజయ్‌కుమార్ సహానికి బజారు ఏరియా ప్రాంతంలో బట్టల దుకాణం ఉంది. 2022 నవంబర్ 6న రాత్రి దుకాణంలో చోరీ జరిగింది. 250 గ్రాముల బంగారు బిస్కెట్లు, రెండు సెల్‌ఫోన్లు, రూ.5000 నగదు దొంగిలించుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌హెచ్‌వో ఎం.రాజు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. బెల్లంపల్లి హన్మాన్‌బస్తీకి చెందిన భార్యాభర్తలు ఎండీ.బద్రుద్దీన్, అస్పీయా సీరిన్‌పై కేసు నమోదు చేశారు. సమగ్ర విచారణ చేసి చార్జీషీట్ దాఖలు చేశారు. కోర్టులో ఏడుగురు సాక్షులను అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కే.అజయ్‌కుమార్ ప్రవేశపెట్టగా జేఎఫ్‌సీఎం మేజిస్ట్రేట్ జే.ముకేష్ విచారణ జరిపారు. నేరం రుజువు కావడంతో నిందితులకు ఆరు నెలల చొప్పున సాధారణ జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
దాడికేసులో ముగ్గురి రిమాండ్
ఆదిలాబాద్‌రూరల్: దాడి కేసులో ముగ్గురిని సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు మావల ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మావల పోలీసుస్టేషన్ పరిధిలోని పలువురు కార్మికులపై ఈనెల 9న కొందరు దాడిచేశారు. కార్మికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి భగత్‌సింగ్ కాలనీకి చెందిన అడ్లూరి రాజు, సమీర్, అర్ బాస్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఆలయాల్లో చోరీ
బోథ్: మండలంలోని పెద్దార్లగుట్టలో హనుమాన్ ఆలయం, వాగు వద్ద గల అయ్యప్ప సన్నిధానంలో చోరీ జరిగింది. ఎస్సై ప్రవీణ్ కుమార్ కథనం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం స్థానికుడు.. అయ్యప్ప సన్నిధానానికి వెళ్లగా తలుపుల తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా సామగ్రి చిందరవందరగా ఉంది. అలాగే హనుమాన్ ఆలయం తాళం పగులగొట్టి ఉండడాన్ని భక్తుడు గమనించాడు. హుండీని పగులగొట్టి ఉండడంతో స్థానికులకు సమాచారం అందించాడు. అందులో నగదు ఎత్తుకెళ్లారని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మండలంలోని పట్నాపూర్‌కు చెందిన మడావి కార్తీక్ చోరీ చేసినట్లు గుర్తించి అరెస్టు చేశారు. ఐదు గంటల్లోనే దొంగను పట్టుకున్న ఎస్సై, పోలీసు సిబ్బందిని గ్రామస్తులు అభినందించారు.
బైక్ చోరీ
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని ద్వారకానగర్‌లో ఆదివారం రాత్రి బైక్ చోరీకి గురైంది. నేరడిగొండ మండలంలోని వాగ్దారికి చెందిన సోయం వెంకటేశ్ ఆదిలాబాద్‌లో అద్దెకు ఉంటున్నాడు. ఇంటి ముందు బైక్ పార్కింగ్ చేసిన ఆయన ఉదయం చూసే సరికి కనిపించకుండా పోయింది. చుట్టుపక్కలా గాలించినా కనిపించలేదు. సోమవారం వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు.