
చెన్నూర్‌రూరల్: యాసంగిలో సాగు చేసిన వరిని మొగి (పీక) పురుగు ఎక్కువగా ఆశిస్తోందని, తగిన సమయంలో నివారణ చర్యలు చేపట్టాలని చెన్నూర్ ఏడీఏ జాడి బాపు సూచించారు. పురుగు ఉధృతిని గమనించి దీపపు ఎరలు, సోలార్ దీపపు ఎర లేదా లింగార్షక బుట్టలు అమర్చుకోవాలని తెలిపారు. ఎరలతో పురుగులు బుట్టల్లో పడి పోతాయని పేర్కొన్నారు. పిలక దశలో ఎకరాకు మూడు లింగార్షక బుట్టలు పెట్టి అందులో వారానికి 25నుంచి 30 పురుగులు పడినప్పుడు సస్యరక్షణ చేపట్టాలని సూచించారు. నారుమడి దశలోనే కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలు లేదా పిప్రోనిల్ గుళికలు చల్లాలని తెలిపారు. 15రోజుల పిలక దశలోనైతే ఎకరాకు కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలు 10కిలోలు చల్లాలని, లేదా కార్టాప్‌హైడ్రాక్లోరైడ్, పిప్రోనిల్ గుళికలను యూరియాలో లేదా ఇసుకలో కలిపి చల్లాలని పే ర్కొన్నారు. చిరు పొట్ట దశలో పురుగు ఉన్నట్లయితే కార్టాప్‌హైడ్రోక్లోరైడ్ లేదా క్లోరాంట్రనిలిప్రోల్ ద్రావణాన్ని పిచికారీ చేయాలని సూచించారు.