
‘మెడికల్ బోర్డు నిర్వహణ తీరు అన్యాయం’
రామకృష్ణాపూర్: సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహణ తీరు చాలా అన్యాయంగా ఉందని హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ మండిపడ్డారు. మందమర్రిలోని యూనియన్ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. హయ్యర్ రిఫర ల్స్ పేరిట తొమ్మిది నెలలపాటు 52 మంది కార్మికులకు జీతాలు రాకుండా కోతపెట్టి చివరికి ఐదుగురిని మాత్రమే ఇన్వాలిడేషన్ చేశారని అన్నారు. మెడికల్ అన్‌ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి హైదరాబాద్, కొత్తగూడెం డాక్టర్లతో కాకుండా ఏ ఏరియా వారికి అక్కడే అన్‌ఫిట్ చేస్తే అసలు మెడికల్ దందా అనేది ఉండదు కదా అని పేర్కొన్నారు. మెడికల్ బోర్డు నిర్వహణ విషయంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు నోరుమెదపకపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. నాయకులు సారయ్య, జె.శ్రీనివాస్, పార్వతి రాజిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.