
● మంచిర్యాల, బెల్లంపల్లిలో నో హాల్టింగ్ ● ఐఆర్‌సీటీసీ
బెల్లంపల్లి రైల్వేస్టేషన్
బెల్లంపల్లి: రైల్వే శాఖ తీసుకుంటున్న ఆకస్మిక, అనా లోచిత నిర్ణయాలు ప్రయాణికులను తీవ్ర గందరగోళానికి, ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఎప్పుడు ఏ తీరైన నిర్ణయం తీసుకుంటారో తెలియ ని అయోమయ పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా జిల్లాలోని ప్రధాన రైల్వేస్టేషన్లు మంచిర్యా ల, బెల్లంపల్లిలో పలు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ తొలగించినట్లు రైల్వే రిజర్వేషన్ పోర్టల్ ఐఆర్‌సీటీసీలో చూపిస్తుండడం ప్రయాణికుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఆయా రైల్వేస్టేషన్లలో సదరు రైళ్ల హాల్టింగ్ ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఓ వైపు రైళ్ల హాల్టింగ్‌కు ఆదేశాలు జారీ చేయాలని పెద్దపల్లి, ఆదిలాబాద్ ఎంపీలు, ఎమ్మెల్యేలు రైల్వే మంత్రి, అధికారులకు వినతిపత్రాలు అందిస్తుండగా.. మరోవైపు ప్రస్తుతం కొనసాగుతున్న హాల్టింగ్‌లను రద్దు చేస్తుండడంతో విమర్శలు వస్తున్నాయి.
నవీకరణ పేరుతో ఎత్తివేతలు
ప్రతీ ఆరు నెలలకోసారి రైల్వేశాఖ రైళ్లను నవీకరణ చేస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఆయా రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని రైళ్ల హాల్టింగ్‌ను కొనసాగించడమా.. రద్దు చేయడమా అనేది రైల్వే అధికారులు నిర్ణయిస్తున్నారు. రైళ్ల హాల్టింగ్ అప్, డౌన్ మార్గాల్లో కనిష్టంగా 40చొప్పున సాధారణ టిక్కెట్లు అమ్మకాలు జరగాల్సి ఉంటుంది. అదే తీరుగా సదరు రైల్వేస్టేషన్లలో ఎక్కే, దిగే ప్రయాణికుల సంఖ్యను రైల్వేశాఖ ప్రామాణికంగా తీసుకుంటుంది. ప్రస్తుతం హాల్టింగ్ తొలగించినట్లు భావిస్తున్న రైళ్లన్నీ కూడా అర్ధరాత్రి పూట ఆయా స్టేషన్లకు చేరుతుండడంతో ప్రయాణికులు ప్రయాణం చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. టిక్కెట్ల విక్రయాలు, ఆదాయం, ప్రయాణికుల సంఖ్యను బేరీజు వేసుకుని రైళ్లకు హాల్టింగ్ కల్పించడం, ఎత్తివేయడం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత రెండేళ్లలో ఇప్పటికి మూడుసార్లు నవీకరణ చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఒకసారి ఏదైనా రైలుకు ప్రయోగాత్మక స్టాప్ సదుపాయం కల్పిస్తే అలాగే కొనసాగించే ఆనవాయితీ ఉండేది. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆర్నెల్లకోసారి హాల్టింగ్ సమస్య ప్రయాణికులను గందరగోళానికి గురి చేస్తోంది. ప్రయాణికుల అవసరాలు, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు సానుకూల నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండగా.. లాభాపేక్షతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించొద్దు
రైల్వే శాఖ ప్రతీ ఆర్నెల్లకో సారి ఆయా రైల్వేస్టేషన్లలో గతంలో ఇచ్చిన ప్రయోగా త్మక హాల్టింగ్‌లను రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం లేదు. దీంతో రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు ఇబ్బందిగా మారడంతోపాటు రైల్వేస్టేషన్‌లో హాల్టింగ్ ఉందా, లేదా లేక ఎత్తేశారా అనేది తెలియక అయోమయానికి గురవుతున్నారు. నిర్ధేశించిన గడువుకు నెల రోజుల ముందుగానే అప్‌డేట్ చేస్తే ఉపయోగంగా ఉంటుంది. ఒకసారి హాల్టింగ్ కల్పించాక కొనసాగించాలే గానీ రకరకాల కారణాలతో ఎత్తి వేసే చర్యలు సరికాదు.
– ఫణి, ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం అధ్యక్షుడు
వెబ్‌సైట్‌లో ఇలా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి–న్యూఢిల్లీ మధ్య రాకపోకలు సాగించే ఏపీ సంపర్క్‌క్రాంతి ట్రై వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 7నుంచి దిగువ మార్గంలో బెల్లంపల్లి, మంచిర్యాల రైల్వేస్టేషన్ల నిలుపుదలను రైల్వే రిజర్వేషన్ పోర్టల్ ఐఆర్‌సీటీసీలో తొలగించినట్లు చూపిస్తోంది. ఈ నెల 4వరకు హాల్టింగ్ ఉన్నట్లు నిర్ధారిస్తుండడంతో ఆ తర్వాత నుంచి హాల్టింగ్‌ను ఎత్తివేసినట్లుగా తెలుస్తోంది.
హైదరాబాద్–నిజాముద్దీన్(న్యూఢిల్లీ)–హైదరాబాద్ మధ్య నడిచే దక్షిణ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎగువ మార్గంలో ఇప్పటికే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో బెల్లంపల్లి రైల్వేస్టేషన్‌ను చూపించడం లేదు. కేవలం దిగువ మార్గంలో రైలు వివరాలు అందుబాటులో ఉండడం గమనార్హం.
సికింద్రాబాద్–రాయ్‌పూర్ మధ్య నడిచే ట్రైవీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు హాల్టింగ్ ఎగువ మార్గంలో బెల్లంపల్లి రైల్వేస్టేషన్ పేరు కనిపించడం లేదు.
కాజీపేట–పూణే మధ్య రాకపోకలు సాగిస్తున్న వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చే సెప్టెంబర్ 28 నుంచి మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో హాల్టింగ్ ఎత్తివేస్తున్నట్లు పోర్టల్‌లో కనిపిస్తుండగా.. సెప్టెంబర్ 21వరకు మాత్రం ఆ రైలు హాల్ట్ ఉన్నట్లు చూపిస్తోంది.

● మంచిర్యాల, బెల్లంపల్లిలో నో హాల్టింగ్ ● ఐఆర్‌సీటీసీ

● మంచిర్యాల, బెల్లంపల్లిలో నో హాల్టింగ్ ● ఐఆర్‌సీటీసీ