జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): తెలంగాణ వైతాళికుడు, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధు డు, సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి జీవితంపై రూపొందించిన చలనచిత్రం స్ఫూర్తిదాయకంగా ఉందని మాజీ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి సాహితి వైజయంతి ట్రస్ట్ నిర్మించిన ‘సురవరం’ బయోపిక్ ప్రివ్యూను మంగళవారం హైదరాబాద్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. సురవరం సేవలను గౌరవిస్తూ ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, ఆయన జీవితచరిత్రను చలనచిత్రంగా తెరకెక్కించడం అభినందనీయమన్నారు. నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న దారిద్య్రం, దైన్యం, ప్రాథమిక హక్కుల లేమి వంటి పరిస్థితులను సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారని పేర్కొన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సురవరం చేసిన కృషిని ఈ చిత్రం ద్వారా నేటి తరానికి పరిచయం చేయడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ ప్రజలంతా ఈ చిత్రాన్ని వీక్షించి చరిత్రను తెలుసుకోవాలని కోరారు.
రాష్ట్ర ఉద్యోగులకు
క్రీడా ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: ఆలిండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ 2026 –27 కోసం రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగులకు క్రీడా ఎంపికలు నిర్వహించనున్నట్లు డీవైఎస్‌ఓ జె.రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. జిల్లాస్థాయి ఎంపికలు వచ్చే నెల 3న డీఎస్‌ఏ మెయిన్ స్టేడియంలో, రాష్ట్రస్థాయి ఎంపికలు హైదరాబాద్‌లో 8, 9 తేదీల్లో జరుగుతాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే అర్హులని తెలిపారు. అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్, హాకీ, కబడ్డీ, లాన్‌టెన్నిస్, పవర్‌లిఫ్టింగ్, స్విమ్మింగ్, టేబుల్‌టెన్నిస్, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్ తదితర క్రీడాంశాల్లో ఎంపికలు ఉంటాయి. పురుషులకు క్రికెట్, ఫుట్‌బాల్, రెజ్లింగ్, బెస్ట్‌ఫిజిక్, యోగా, ఖోఖోలోనూ ఎంపికలు నిర్వహిస్తారు. అర్హులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీవైఎస్‌ఓ కోరారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
మానవపాడు: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని పెద్దపోతులపాడులో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ జమీరుద్దీన్ వివరాల ప్రకారం బోయ మహేశ్‌బాబు(34) అలంపూర్ చౌరస్తాలోని ఓ చికెన్ దుకాణంలో పని చేస్తున్నాడు. ఈ నెల 20న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యయత్నం చేయగా కుటుంబ సభ్యులు అలంపూర్ చౌరస్తాలోని ఆస్పత్రికి, అనంతరం కర్నూలుకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏఎస్‌ఐ తెలిపాడు. మృతుడి భార్య రాధిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
● జిల్లాస్థాయిలో 3న.. రాష్ట్రస్థాయిలో 8, 9న ఎంపికలు


