మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఎస్‌ఐఆర్‌లో కులగణనకు సంబంధించి బీసీల వివరాల నమోదు కోసం ప్రత్యేక కాలమ్ లేకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశ జనాభాలో 60 శాతం వరకు ఓబీసీలు ఉన్నప్పటికీ వారి వివరాలను నమోదు చేయడంలో నిర్లక్ష్యం తగదన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎస్‌ఐఆర్‌లో ఎస్సీ, ఎస్టీ, ఇతరులు అనే కాలమ్‌లతో సరిపెట్టారని, బీసీలకు ప్రత్యేక కాలమ్ ఎందుకు లేదని ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. బీపీ మండల్ కమిటీ సిఫారసుల మేరకు 27 శాతం రిజర్వేషన్ అమలవుతున్నా.. పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేదన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు.
అయోధ్య రామాలయంలో హుండీతో పాటు బంగారం లెక్కలను పారదర్శకంగా వెల్లడించాలని హనుమంతరావు డిమాండ్ చేశారు. టీచర్స్‌కాలనీలోని రామాలయంలో ప్రత్యేక పూజల అనంతరం డీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఆలయ నిర్వహణలో అవకతవకలపై సీబీఐ లేదా స్వతంత్ర కమిటీతో విచారణ జరిపించాలని కోరారు. దేవుడి పేరు చెప్పి రాజకీయ లబ్ధి పొందుతున్నారని బీజేపీపై విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీలపై ఆందోళన వ్యక్తం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు కాంగ్రెస్ చేపడుతున్న నిరసనలకు మద్దతివ్వాలని కోరారు. కార్యక్రమానికి ముందు పది నిమిషాల పాటు మౌనం పాటించారు. ఆయా కార్యక్రమాలలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌యాదవ్, అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, డీసీసీ అధ్యక్షుడు ఎ.సంజీవ్‌ముదిరాజ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, పార్టీ నాయకులు సత్తూర్ చంద్రకుమార్‌గౌడ్, వినోద్‌కుమార్, షబ్బీర్ అహ్మద్, బెక్కరి మధుసూదన్‌రెడ్డి, రాములుయాదవ్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఐఆర్‌లో బీసీలకుప్రత్యేక కాలమ్ ఏది?
బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చాలి
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ వీహెచ్


