పాలమూరు ప్రాజెక్టుకు నిధులెన్ని కావాలో అడగండి | - | Sakshi
Sakshi News home page

పాలమూరు ప్రాజెక్టుకు నిధులెన్ని కావాలో అడగండి

Aug 26 2026 1:12 AM | Updated on Aug 26 2026 1:12 AM

ముందు డీపీఆర్‌ రివైజ్‌ చేయాలి.. కేంద్రం సహకరిస్తుంది

కాంగ్రెస్‌ది డైవర్షన్‌ పాలిటిక్స్‌.. సీఎం హంగామా తప్పా చేసిందేమీ లేదు

రైతు బీమా వెంటనే రెన్యువల్‌ చేసి ప్రీమియం చెల్లించాలి: డీకే అరుణ

పాలమూరు: ప్రజలను కాంగ్రెస్‌ హామీల నుంచి పక్కదారి పట్టించేందుకే సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. మూడు నెలలకోసారి పాలమూరు జిల్లా ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై హంగామా చేయడం తప్ప.. పనులు ముందుకు సాగడం లేదన్నారు. మంగళవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు మొదట డీపీఆర్‌ను రివైజ్‌ చేయాలని, ప్రాజెక్టుకు ఎంత నిధులు అవసరమో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడిగితే సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ప్రాజెక్టులకు ‘జాతీయ హోదా’ అనే పదమే లేదని స్పష్టం చేశారు. గట్టు లిఫ్ట్‌ 1.5 టీఎంసీల పనులే పూర్తికాలేదని, ఇప్పుడు 3 టీఎంసీలు అంటున్నారని విమర్శించారు. గుడ్డెందొడ్డి 15 టీఎంసీలు, గట్టు 3 టీఎంసీలు, ర్యాలంపాడును 4 టీఎంసీల సామర్థ్యం పెంపుపై ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం తీవ్రంగా ఉందని, ఆ సమస్యలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం సహా ఆ పార్టీ నేతలు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని అరుణ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రిజర్వాయర్లు పూర్తి చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు పేరుతో కమిషన్ల కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, రైతు బీమాను వెంటనే రెన్యువల్‌ చేసి ప్రీమియం చెల్లించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, పద్మజారెడ్డి, అంజయ్య, జనార్ధన్‌రెడ్డి, రాజేశ్వర్‌, కృష్ణవర్ధన్‌రెడ్డి, కార్పొరేటర్లు రమేష్‌, మర్రి జ్యోతి, యాదయ్య, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement