మన్ననూర్: ప్రజాస్వామ్య దేశంలో వన్యప్రాణులకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా ఆదివాసీ చెంచులకు ఇవ్వకపోవడం దౌర్భాగ్యమని పీబీటీజీ, 9 తెగల జేఏసీ రాష్ట్ర చైర్మన్ చెంచు రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రాష్ట్ర ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివాసీ చెంచుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో అదిలాబాద్, భద్రాచలం, నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన చెంచులు, తొట్టి, కొలాం, కొండరెడ్డిల ఐక్యవేదిక ప్రతినిధులతో ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి నిమ్మల శ్రీనివాసులు, పలువురు వక్తలతో కలిసి మాట్లాడారు. దశాబ్దాల కాలంగా నల్లమల పరీవాహక ప్రాంతంలో అడవినే ఆధారంగా చేసుకొని జీవనం చేస్తున్న చెంచులను వన్యప్రాణుల కన్నా తక్కువ చేయడంతో పాటూ వేధింపులకు గురిచేయడం దురదృష్టకరమన్నారు. ప్రస్తుత పాలకులు నిజాం నిరుంకుష పాలనను తలపిస్తున్నారని మండిపడ్డారు. చెంచులను దైవ పూజారులని అలాంటి చెంచుల అభివృద్ధి, సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏలో రెగ్యులర్ పీఓ, సిబ్బంది లేక చెంచుల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య బద్ధంగా సమస్యలు తెలియజేసుకునేందుకు కూడా కనీస స్వేచ్ఛలేక పోగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకోకుండా పోలీసుల నిర్భందం బాధకరమన్నారు. అడవికి మూలవాసులైన చెంచుల కనీస సమస్యలు పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించాలని విజ్ఞప్తి చేశారు. చెంచుల సమస్యల పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని లేని పక్షంలో ఐటీడీఏ మొదలుకొని అసెంబ్లీ వరకు దశలవారీగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఐటీడీఏ ఏఓ జాఫర్ హుసేన్‌కు అందజేశారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ముర్ల రమేష్‌రెడ్డి, తిరుపతి, కురిసెంగ వేణు, నైజాం రమేష్, మహేష్, బాలగురువయ్య, మంజుల, బయ్యమ్మ, మల్లయ్య, మాసయ్య, మురళీధర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


