మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: వన మహోత్సవంలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో మొక్కలు నాటడంతో పాటు నీటి, మట్టి సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జోగుళాంబ, యాదాద్రి సర్కిల్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శివాల రాంబాబు అన్నారు. మంగళవారం స్థానిక అప్పన్నపల్లిలోని టీబీ ఆస్పత్రి మార్గంలో, జిల్లా అటవీ శాఖ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ వర్షపునీటిని ఒడిసిపట్టి భూగర్భజలాలను పెంపొందించడమే గాక నేల కోతను అరికట్టేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమష్టి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. మంగళవారం ఒక్కరోజే జిల్లాలో సుమారు 70 వేల మొక్కలు, జోగుళాంబ గద్వాలలో 32 వేలు, వనపర్తిలో 15 వేలు, నారాయణపేటలో 7 వేలకు పైగా నాటినట్లు వివరించారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎం.డి.జకీరుద్దీన్, డీపీఆర్‌ఓ పి.శ్రీనివాస్, డీఈఈ ఇస్రానాయక్ తదితరులు పాల్గొన్నారు.


