● ప్రతి ఎకరాకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తాం
● ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి
వనపర్తి/ఖిల్లాఘనపురం: పాలమూరులోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తా మని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పర్యాటక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలోని కర్నెతండా ఎత్తిపోతల పథకాన్ని ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, రాజేష్‌రెడ్డితో కలిసి మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. రూ.87.53 కోట్లతో ఏర్పాటు చేసిన కర్నెతండా లిఫ్టు ద్వారా నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని గిరిజన తండాల్లో 851 ఎకరాలకు, వనపర్తి జిల్లా లోని ఖిల్లాఘనపురం, పెద్దమందడి, వనపర్తి మండలాల్లోని గ్రామాలు, గిరిజన తండాల్లోని 3,384 ఎకరాలకు సాగునీరు అందించే వెసులుబాటు ఉంటుందన్నా రు. గిరిజనుల ఆకాంక్ష మేరకు ఈ లిఫ్టు కు శ్రీసంత్ సేవాలాల్ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరు మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా మౌలిక వసతులను మెరుగుపర్చుతామని పేర్కొన్నారు. 3.35 కోట్ల మందికి సన్న బియ్యం, 7లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, 70 వేల ఉద్యోగాలు, ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తండాలో నెట్‌వర్క్ సమస్యను అధిగమించేందుకు కర్నెతండా ప్రాంతంలో సెల్‌టవర్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గత పాలకులు అనేక ప్రాజెక్టులను పూర్తి చేశామని ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసుకుంటూ ప్రజలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు.


