జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని పెండింగ్ ప్రాజెక్టుల సాధన సమితి జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం టీఎన్‌జీఓ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలకుల నిర్లక్ష్యం, పక్షపాతంతో ప్రాజెక్టులు ఏళ్లుగా పెండింగ్‌లో ఉండటంతో రైతులు, ప్రజలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి సాగు, తాగునీరు అందించాలని కోరారు. పాలమూ రు ప్రయోజనాలను దెబ్బతీసే డిండి ఎత్తిపోత ల పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు మంగళవారం జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్‌లో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హాజరవుతారని చెప్పారు. ఉమ్మడి జిల్లా నుంచి రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.
రేపు మిలాద్ జులూస్
స్టేషన్ మహబూబ్‌నగర్: మిలాదున్నబీ వేడుకల్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలో మిలాద్ జులూస్ ర్యాలీ నిర్వహించనున్నట్లు మజ్లిస్ అహ్లె సున్నత్‌వల్ జమాత్ మిలాద్ జులూస్ జల్సా కమిటీ ప్రతినిధులు తెలిపారు. సోమవారం షాసాబ్‌గుట్ట దర్గా ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అసర్ నమాజ్ అనంతరం సాయంత్రం మక్కామసీద్ నుంచి జులూస్ ప్రారంభమై క్లాక్‌టవర్, మున్సిపల్ కార్యాలయం, అశోక్‌టాకీస్, అంబేద్కర్ చౌరస్తా, న్యూటౌన్ మీదుగా షాసాబ్‌గుట్టలోని హజ్రత్ మర్దాన్ అలీషా దర్గా ఆవరణకు చేరుకుంటుందని తెలిపారు. పోలీసుల సూచనల మేరకు డీజేలు, ఇతర సౌండ్ సిస్టమ్‌లు వినియోగించవద్దని కోరారు. అనంతరం దర్గా ఆవరణలో ధార్మిక సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అల్లమా సయ్యద్ అలంగీర్ అష్రఫ్ అష్రఫీ, జామియా నిజామియాకు చెందిన మౌలానా ముఫ్తి మహ్మద్ హుస్సేన్ ఖురేషి సందేశాలు ఇస్తారని తెలిపారు.
తగ్గిన విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ఎగువ నుంచి జూరాలకు వరద ప్రవాహం నిలిచిపోవడంతో సోమవారం కేవలం 2 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ, దిగువలో ఒక్కొక్క యూనిట్ ద్వారా విద్యుదుత్పత్తి చేపడుతూ 7,134 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు.


