మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాలో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) క్రీడా పోటీలకు రంగం సిద్ధమవుతోంది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి అండర్–14, అండర్–17 బాల, బాలికల విభాగాల్లో మండల, జిల్లా, ఉమ్మడి జిల్లా స్థాయిల్లో పోటీలు నిర్వహించనున్నారు. మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు. వచ్చేనెల 10లోపు మండలాల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్ తదితర క్రీడల్లో టోర్నీ కమ్ సెలక్షన్స్ నిర్వహించనున్నారు. ఈ నెల 20లోపు జిల్లాస్థాయి పోటీలు పూర్తి చేసి.. అనంతరం ఉమ్మడి జిల్లా (జోనల్) స్థాయి ఎంపికలు చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లా స్థాయిలో ఎంపికయ్యే క్రీడాకారులు రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ పోటీల్లో పాల్గొంటారు.
జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి
రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ పోటీల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా కృషి చేయాలని డీఈఓ విజయకుమారి పీడీలు, పీఈటీలకు సూచించారు. శనివారం నగరంలోని ఇండోర్ స్టేడియంలో జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ, జెడ్పీ, కేజీబీవీ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. క్రీడాకారుల ఎంపికలను పారదర్శకంగా నిర్వహించాలని, విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంపొందిస్తూ నాణ్యమైన శిక్షణ అందించాలని డీఈఓ సూచించారు. అనంతరం నూతన జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులైన వేణుగోపాల్‌ను సన్మానించారు. సమావేశంలో డీవైఎస్‌ఓ రాజశేఖర్‌రెడ్డి, ఎంఈఓ లక్ష్మణ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
వచ్చేనెల 10లోపు మండలస్థాయి టోర్నీ కమ్ సెలక్షన్స్
20లోగాజిల్లాస్థాయి పోటీలు.. ఆపై ఉమ్మడి జిల్లా ఎంపికలు
ఎస్‌జీఎఫ్‌లో జిల్లా అగ్రస్థానమే లక్ష్యం: డీఈఓ విజయకుమారి


