● ఉమ్మడి పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ
భూత్పూర్: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి లిఫ్టు ద్వారా నీటిని అక్రమంగా తరలించే డిండి లిఫ్టును వెంటనే రద్దు చేయాలని, 25న జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపం ఎదుట నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఉమ్మడి పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ నాయకులు రాఘవాచారి, బెక్కం జనార్ధన్, చెన్న కిష్టన్న, వామన్‌కుమార్, హరిబాబు కోరారు. గురువారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. లిఫ్టులు, కాల్వలు, రిజర్వాయర్ నిర్మాణం, పొలాలకు నీరు ఇచ్చేందుకు తీసుకోవాల్సిన సిబ్బంది దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలన్నారు. గతంలో పాలమూరును సస్యశ్యామలం చేస్తామని పాలమూరుకు ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన మాజీ సీఎం కేసీఆర్ పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చి అధికారంలో ఉండికూడా పూర్తి చేయలేకపోవడం పాలమూర్ ప్రజల దౌర్భాగ్యమని మండిపడ్డారు. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి ప్రాజెక్టుల పర్యటనతో పాలమూరు ప్రజలు, రైతులు ఆశగా ఉన్నారని, పాలమూరు ప్రాజెక్టును పూర్తిచేసి సాగునీరందించాలన్నారు. ఆనాడు డిండి ప్రాజెక్టును అడ్డుకుంటామని చెప్పినా నాయకులు నేడు అధికారంలో ఉన్నారని.. పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి డిండి ప్రాజెక్టు లిఫ్టును రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. ఎంపీ డీకే అరుణ కేంద్రంతో చర్చించి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేలా కృషి చేయాలని కోరారు. అనంతరం మహాధర్న కరపత్రాలను చౌరస్తాలో పంపిణీ చేశారు.


