గడువు ముగిసింది.. బీమా లేదు! | - | Sakshi
Sakshi News home page

గడువు ముగిసింది.. బీమా లేదు!

Aug 21 2026 7:15 AM | Updated on Aug 21 2026 7:15 AM

7,231 క్లెయిమ్‌లు.. 7,076 పరిష్కారం

జిల్లాలో 2018 నుంచి 2025–26 వరకు రైతు బీమా కింద 7,231 క్లెయిమ్‌లు నమోదయ్యాయి. ఇందులో 7,076 క్లెయిమ్‌లను పరిష్కరించి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.353.80 కోట్ల పరిహారం అందించారు. పంట నష్టం లేదా దిగుబడి తగ్గిన సందర్భంలో కాకుండా.. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రైతును కోల్పోయిన సమయంలో ఈ మొత్తం ఆ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచింది.

గుంట భూమి ఉన్నా అర్హతే

రైతు బీమాలో చేరేందుకు పెద్ద మొత్తంలో భూమి ఉండాల్సిన అవసరం లేదు. కనీసం గుంట (2.5 సెంట్లు) భూమి ఉన్న రైతులు అర్హులు. 10 నుంచి 59 ఏళ్లలోపు వయసు ఉండాలి. పట్టాదారు పాస్‌బుక్‌, ఆధార్‌, నామినీ వివరాలను వ్యవసాయ అధికారులు నమోదు చేసి రైతులను బీమా పరిధిలోకి తీసుకొస్తారు. 2025 ఆగస్టులో ఒక్కో రైతుకు జీఎస్టీతో కలిపి రూ.3,500 చొప్పున ప్రభుత్వం ప్రీమియం చెల్లించింది. ఆ పాలసీ గడువు 2026 ఆగస్టు 13తో ముగిసింది. సాధారణంగా కొత్త కాలానికి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈసారి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో రైతులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం): ఆ కుటుంబానికి రైతే పెద్ద దిక్కు.. పొలం సాగు చేస్తూ పిల్లలను చదివిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అనుకోని మరణంతో ఆ కుటుంబం ఆదాయాన్ని కోల్పోయినప్పుడు రైతు బీమా కొండంత అండగా నిలిచింది. రైతు ఏ కారణంతో మృతి చెందినా నామినీకి రూ.5 లక్షల పరిహారం అందడంతో ఎన్నో కుటుంబాలు కష్టకాలం నుంచి బయటపడ్డాయి. అయితే ఇన్నాళ్లూ భరోసాగా ఉన్న ఈ బీమా కవచానికి ఇప్పుడు గడువు ముగిసింది. గతేడాది ఆగస్టులో ఒక్కో రైతుకు రూ.3,500 చొప్పున ప్రభుత్వం ఎల్‌ఐసీకి చెల్లించిన ప్రీమియం కాలపరిమితి ఈ నెల 13తో ముగిసింది. వారం రోజులు గడిచినా కొత్త ప్రీమియం చెల్లింపుపై స్పష్టత లేకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.

2.18 లక్షల మంది అర్హులు

తేడాది జిల్లాలో 2.33 లక్షల మంది రైతులు ఉండగా.. వారిలో 2.18 లక్షల మంది రైతు బీమాకు అర్హులుగా ఉన్నారు. అంటే జిల్లాలో లక్షలాది కుటుంబాలకు ఈ పథకం భద్రత కల్పిస్తోంది. ఇంత పెద్ద సంఖ్యలో రైతులు ఆధారపడుతున్న పథకానికి ప్రభుత్వం ఏటా ప్రీమియం చెల్లిస్తూ వచ్చింది. బీమా పరిధిలో ఉన్న రైతు మృతి చెందినప్పుడు అవసరమైన ధ్రువపత్రాలను వ్యవసాయ అధికారులకు అందజేస్తే.. వివరాలను పోర్టల్‌లో నమోదు చేస్తారు. ప్రక్రియ పూర్తయిన అనంతరం బీమా సంస్థ పరిహారాన్ని నామినీ ఖాతాలో జమ చేస్తుంది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తగ్గింది.

మార్గదర్శకాలు రాలేదు

రైతు బీమా పథకానికి సంబంధించి పాత పాలసీల రెన్యువల్‌, కొత్తగా అర్హులైన రైతులను బీమా పరిధిలోకి చేర్చే అంశంపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు అందలేదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన వెంటనే వాటి ప్రకారం తదుపరి చర్యలు చేపడతాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రక్రియను అమలు చేస్తాం. – గోవింద్‌నాయక్‌,

జిల్లా వ్యవసాయశాఖ అధికారి

కుటుంబానికి ఆర్థిక భరోసా

రైతు అకాల మరణంతో కుటుంబ ఆదాయం ఒక్కసారిగా నిలిచిపోతుంది. పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, అప్పుల భారం అన్నీ కుటుంబంపై పడతాయి. అలాంటి సమయంలో ఒకేసారి అందే రూ.5 లక్షల పరిహారం తక్షణ ఆర్థిక ఊరట కల్పిస్తోంది. అందుకే రైతులు ఈ పథకాన్ని పంటకు సంబంధించిన బీమాగా కాకుండా.. కుటుంబానికి భరోసాగా భావిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికీ 125 క్లెయిమ్‌లు పరిష్కారం కావాల్సి ఉంది. మరో 32 క్లెయిమ్‌లు ఎల్‌ఐసీ వద్ద ప్రక్రియలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 2025–26లో 912 క్లెయిమ్‌లు నమోదు కాగా.. 783 పరిష్కరించారు. 29 క్లెయిమ్‌లు ప్రక్రియలో ఉండగా.. మరో 100 పరిష్కారం కావాల్సి ఉంది.

ఆగస్టు 13తో ముగిసిన గడువు

వారం రోజులు దాటినా కొత్త ప్రీమియంపై ప్రభుత్వం నుంచి స్పష్టత కరువు

పథకం కొనసాగింపుపై రైతుల్లో ఆందోళన

ఎనిమిదేళ్లలో 7,076 కుటుంబాలకు రూ.353.80 కోట్ల భరోసా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement