సమన్వయంతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో పనిచేయాలి

Jul 10 2026 7:28 AM | Updated on Jul 10 2026 7:28 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): గ్రామాలు సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలని, గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఒక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు పోవాలని కలెక్టర్‌ ఖుష్బూగుప్తా అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అని అన్నారు. గ్రామానికి సంబంధించిన ప్రతి సంక్షేమ పథకం, అభివృద్ధి కార్యక్రమం, నిధులు, పనుల పురోగతి, ప్రభుత్వ మార్గదర్శకాలపై సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు. గ్రామపంచాయతీల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మంజూరైన పనులు, అందిన నిధులు, పూర్తయిన పనులు, పెండింగ్‌ పనులు, చెల్లింపుల వివరాలు వంటి సమగ్ర సమాచారాన్ని ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామసభలు, వార్డు సభల ద్వారా ప్రజలకు వివరించి సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. గ్రామాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌, ట్రెయినీ కలెక్టర్‌ సాయి శివాని, జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌ఐఆర్‌కు రాజకీయ పార్టీలు సహకరించాలి

జిల్లాలో చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా కోరారు. కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కొంతమంది బీఎల్‌ఓలు ఇంటింటికి వెళ్లకుండా ఒకేచోట కూర్చొని ఎన్యూమరేషన్‌ ఫారాలను పంపిణీ చేస్తున్నారని, చాలా మంది ఓటర్లకు ఫారాలు ఎలా నింపాలో అవగాహన లేకపోవడంతో పాటు కొందరు బీఎల్‌ఓలకు కూడా పూర్తి అవగాహన లేదని పలువురు నాయకులు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పార్టీల ప్రతినిధులు చేసిన సూచనలు, లేవనెత్తిన అంశాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో బీఎల్‌ఓల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని గుర్తించామని, వారికి అవసరమైన సహకారం అందించేందుకు ఆర్‌పీలు, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లు నిరంతరం పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement