● ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దు
● అధికారుల సమీక్షలో కలెక్టర్ ఖష్బూగుప్తా
● జిల్లాలో 12 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
● హాజరుకానున్న 4,214 మంది విద్యార్థులు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్)/మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలో ఆదివారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయస్థాయి మెడికల్ ప్రవేశ పరీక్ష (నీట్)ను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం పరీక్షకేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), ప్రధానోపాధ్యాయులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 12 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కేంద్రాల్లో సీసీ కెమెరాలు, జామర్లు, బయో మెట్రిక్ హాజరు వ్యవస్థలను ఏర్పాటు చేసి, అవి సక్రమంగా పనిచేస్తున్నాయా లేవా నిర్ధారించుకోవాలని తెలిపారు. అలాగే కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, అభ్యర్థుల తనిఖీ కోసం అవసరమైన బ్యాక్ అప్ ఏర్పాట్లును కూడా చేసుకోవాలని ఆదేశించారు. తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని, తరగతి గదుల్లో అభ్యర్థులు సరిపడా కుర్చీలు, టేబుళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షను పారదర్శకంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు పోలీస్‌శాఖ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా బయోమెట్రిక్ అటెండెన్స్‌ను అన్ని కేంద్రాల్లో ఉదయం 9.30 గంటలలోగా సిద్ధంగా ఉండేలా చూడాలని సంబంధిత అధికారికి సూచించారు. వైద్యశాఖ అధికారులు కేంద్రాలలో మెడికల్ క్యాంపులో మందులు, ఓఆర్‌ఎస్ పాకెట్ల ను అందుబాటులో ఉంచాలన్నారు. ఉదయం 9 గంటల నుంచి ఎక్కువ బస్సులు నడిపేలా చూడా లని ఆర్టీసీ అధికారులకు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జేఎల్‌బీ హరిప్రియ, డీఆర్‌ఓ రాంరెడ్డి, జిల్లా నీట్ నోడల్ అధికారి వై.సురేందర్, తదితరులు పాల్గొన్నారు.
● జిల్లాలో మొత్తం 4,214 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. వీరిలో 25 మంది దివ్యాంగ అభ్యర్థులు ఉండగా, వారికి అదనంగా ఒక గంట సమయం ఇచ్చి సాయంత్రం 6.00గంటల వరకు పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు. పరీక్షలను సజావు గా నిర్వహించేందుకు 372 మంది ఇన్విజిలేటర్లును, 13 మంది పరిశీలకులు నియమించారు.
అభ్యర్థులకు సూచనలు..
అభ్యర్థులకు ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల లోపు మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి ప్రవేశం కల్పిస్తారు. 1.30 గంటల తర్వాత గేట్లు మూసివేస్తారు.
పరీక్ష మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరుగుతుంది.
మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, చేతి గడియారాలు, కాలిక్యులేటర్లు, ఆభరణాలు, పెన్సిల్లు, పెన్నులు, అనుమతి లేని ఎలాంటి వస్తువులను తీసుకురావద్దు. పరీక్ష కేంద్రాల్లోనే అభ్యర్థులకు పెన్నులు అందజేస్తారు.
అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులను తీసుకొని రావాలి. నిర్ణీత డ్రెస్ కోడ్‌ను పాటిస్తూ, ఫార్మల్ దుస్తుల్లో హాజరుకావాలి.


