మహబూబ్‌నగర్ క్రైం: ప్రతి డ్రైవ్‌కు డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది చాలా ముఖ్యమని, విద్యార్థుల భద్రత మీ చేతుల్లోనే ఉందని ఎస్పీ డి.జానకి అన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రతపై ఎస్పీ కార్యాలయంలో బుధవారం పాఠశాల, కళాశాల బస్సు డ్రైవర్లకు అప్రమత్తంగా డ్రైవింగ్ చేయడంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి డ్రైవర్ జాగ్రత్తగా డ్రైవ్ చేయడం బాధ్యతగా తీసుకోవాలని, డ్రైవర్ ఎప్పుడూ ఇతరుల తప్పులను ముందుగానే అంచనా వేసి జాగ్రత్తగా వాహనాలు తీసుకువెళ్లడం అలవాటు చేసుకోవాలన్నారు. తప్పక వేగ పరిమితులు పాటించాలని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎన్‌బీ రత్నం, ఏఆర్ ఏఎస్పీ సురేష్‌కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, బాలాజీ, రమణారెడ్డి, ఆర్టీఓ రఘుకుమార్, ట్రాఫిక్ సీఐ రాజేందర్‌రెడ్డి, ఉమెన్ సీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.
● అరైవ్– అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా నగరంలోని పోలీస్ లైన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ జానకి హాజరై విద్యార్థులతో కలిసి మానవహారం నిర్వహించారు. అనంతరం రోడ్డు భద్రతతోపాటు ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.


