కేటీదొడ్డి: కన్నతండ్రి ఇక లేరనే నిజాన్ని జీర్ణించుకోలేక ఆ పిల్లాడి గుండె తల్లడిల్లింది. కంటిపాపలా చూసుకున్న తండ్రి భౌతికంగా దూరమైనా ఆశయమే లక్ష్యంగా ఆ విద్యార్థి పుట్టెడు దుఃఖంలోనూ పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కేటీదొడ్డి మండలం గంగన్‌పల్లికి చెందిన విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సదానందం ఆచారి మృతిచెందారు. ఇంట్లో పార్థివదేహం ఉండగానే బుధవారం పాతపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో జరిగే హిందీ పరీక్షకు అతడి కుమారుడు సాయివిష్ణు హాజరు కావాల్సి ఉంది. సమాచారం అందుకున్న ఎంఈఓ విజయభాస్కర్, ఉపాధ్యాయులు విద్యార్థికి ధైర్యం చెప్పడంతో పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష రాస్తున్నంత సేపు ఆ విద్యార్థి కళ్లు కన్నీళ్లతో నిండిపోవడం చూసిన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు చలించిపోయారు. పరీక్ష అనంతరం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.


