ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు
● అలంపూర్‌లో ప్రారంభమైనబ్రహ్మోత్సవాలు
● తొలిరోజు ఆలయాల్లో ప్రత్యేక పూజలు
అలంపూర్: అలంపూర్‌లో వెలసిన బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో తొలిరోజు శనివారం బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ దీప్తి ధ్వజ మండపం వద్ద గోపూజలు చేశారు. అనంతరం అమ్మవారికి మంగళద్రవ్యాలు, పట్టువస్త్రాలను సమర్పించారు. యాగశాలలో గణపతి పూజ, పుణ్యాహవచన, కంకణధారణ, ఋత్విక్ వరణ వంటి ఆరంభ పూజలు జరిపించారు. నవగ్రహ, క్షేత్రపాలక, చతుషష్టియోగిని, వాస్తు, సర్వతో భద్రభద్ర మండపం, ద్వాదశలింగతో భద్రమండపాలను ఆవాహన చేసి ఆయా దేవతలను మంత్ర పూర్వకంగా ఆహ్వానించి ప్రాణప్రతిష్ఠ చేశారు. బాలబ్రహ్మేశ్వర ఉద్యానవనంలో పుట్టమట్టిని తీసుకొచ్చి ప్రదక్షిణలు చేశారు.
ఘనంగా ధ్వజారోహణం
బాలబ్రహ్మేశ్వరస్వామి వారి ఆలయంలో ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించడం ఆనవాయితీగా ఉంటుందని అర్చక స్వాములు తెలిపారు. ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఉత్సవాలకు ముస్తాబు
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మహన్యాస, ఏకాదశ రుద్రపారాయణ, లింగోద్భవ కాలంలో విశేష అభిషేకాలు జరుగనున్నాయి. తెల్లవారు జామున ఆది దంపతుల కల్యాణం వైభవంగా నిర్వహిస్తారు. జాగరణకు వచ్చే భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈఓ తెలిపారు.
ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు
ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు


