ట్విస్ట్‌లపై ట్విస్ట్‌లు | - | Sakshi
Sakshi News home page

ట్విస్ట్‌లపై ట్విస్ట్‌లు

Feb 15 2026 9:43 AM | Updated on Feb 15 2026 9:43 AM

ట్విస్ట్‌లపై ట్విస్ట్‌లు

ట్విస్ట్‌లపై ట్విస్ట్‌లు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఉమ్మడి పాలమూ రులో హంగ్‌ ఏర్పడిన పురపాలికల్లో క్యాంప్‌ రాజ కీయాలు రసవత్తరంగా మారాయి. మొత్తంగా ఐదు మున్సిపాలిటీల్లో సంకీర్ణ పరిస్థితులు తలెత్తగా.. మ్యాజిక్‌ ఫిగర్‌కు అడుగుదూరంలో ఉన్న రెండింటిలో పాగా వేసేదెవరనే దానిపై స్పష్టత వచ్చింది. స్వతంత్ర అభ్యర్థి చేయి అందుకోవడంతో దేవరకద్రలో కాంగ్రెస్‌, ఎక్స్‌ అఫీషియోగా ఎమ్మెల్యే విజయుడు ఓటు వేయనుండడంతో అలంపూర్‌లో బీఆర్‌ఎస్‌ పీఠం దక్కించుకోనుంది. మిగిలిన నారాయణపేట, గద్వాల, అమరచింతలో విభిన్న పరిస్థితు లు నెలకొనగా.. అటు, ఇటు జంపింగ్‌లు, క్యాంప్‌ లు, గడియగడియకూ మారుతున్న రాజకీయ పరి ణామాలు, ట్విస్ట్‌లపై ట్విస్ట్‌లు హీటెక్కిస్తున్నాయి.

అటు ఇటుగా ఒకరికొకరు..

నారాయణపేటలో కాంగ్రెస్‌తో బీఆర్‌ఎస్‌ కలవకుండా చేస్తే బీజేపీ విజయం సాధించడం ఖాయం. ఒకవేళ బీజేపీకి బీఆర్‌ఎస్‌ మద్దతిస్తే పీఠం అధిరోహించడం నల్లేరు మీద నడకనే. అదేవిధంగా గద్వాలలో కాంగ్రెస్‌కు పీఠం దక్కకుండా, ఎమ్మెల్యే చేతికి చిక్కకుండా ఉండాలంటే బీఆర్‌ఎస్‌కు బీజేపీ మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలో గద్వాలలో బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తే నారాయణపేటలో తమకు మద్దతు ఇవ్వాలనే షరతుతో బీజేపీ రాయబారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇలా జరిగిన పక్షంలో అటు గద్వాల, ఇటు నారాయణపేటలో పుర పీఠాలు కాంగ్రెస్‌కు దక్కడం కష్టమేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఈ కారణాలతోనే..

● నారాయణపేటలో 24 వార్డు స్థానాల్లో బీజేపీ 11, కాంగ్రెస్‌ ఏడు, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం రెండు స్థానాల చొప్పున, ఏఐఎఫ్‌బీ, ఇండింపెండెంట్‌ ఒక్కో స్థానంలో గెలుపొందాయి. బీజేపీకి ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు పలుకుతుండగా.. మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ ఎక్స్‌ అఫీషియో ఓటుతో కలిపి బలం మ్యాజిక్‌ ఫిగర్‌ 13కు చేరుతుంది. కాంగ్రెస్‌కు ఎంఐఎం అభ్యర్థులు ఇద్దరు, ఒక ఏఐఎఫ్‌బీ అభ్యర్థి మద్దతు తెలుపుతుండగా.. వారి బలం పదికి చేరింది. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఎక్స్‌ అఫీషియోగా ఓటు వేస్తే 11కు చేరనుంది. ఇక్కడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన పక్షంలో ఆ పార్టీ బలం 13కు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వకుండా బీజేపీ కట్టడి చేసే వ్యూహాలను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

● గద్వాలలో మొత్తం 37 వార్డు స్థానాలు ఉండగా.. కాంగ్రెస్‌ 16, బీఆర్‌ఎస్‌ 11, బీజేపీ ఏడు, స్వతంత్రులు ఇద్దరు, ఎంఐఎం అభ్యర్థి ఒకరు గెలుపొందారు. మ్యాజిక్‌ ఫిగర్‌ 19 కాగా.. ఇద్దరు స్వతంత్రులు ఇద్దరు, ఒక ఎంఐఎం అభ్యర్థితో కలిపి కాంగ్రెస్‌ బలం 19కి చేరింది. అదే బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిస్తే వారి బలం 18కి చేరుతోంది. ఈ క్రమంలో ఇద్దరు స్వతంత్రులనుతమ వైపునకు తిప్పుకునేలా ఆ పార్టీల నేతలు పావులు కదుపుతున్నారు.

● పెబ్బేరు పుర పీఠం జనరల్‌కు కేటాయించడం.. కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ రావడంతో పార్టీ సీనియర్‌ నేత శ్రీనివాస్‌గౌడ్‌, తన భార్యకు అవకాశం ఇవ్వాలని ఎల్లారెడ్డి పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఇరువురిని ఎమ్మెల్యే మేఘారెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ఐదు వార్డుల ను దక్కించుకున్నందున ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఇబ్బంది కలిగే అవకాశం ఉందనే ఆలోచనలో ఎమ్మెల్యే తన ఎక్స్‌ అఫీషియో ఓటును అక్కడే వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.

● అమరచింత మున్సిపాలిటీలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో హంగ్‌ ఏర్పడింది. బీజేపీ కౌన్సిలర్లను కాంగ్రెస్‌ లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. ఎంపీ డీకే అరుణ ముందస్తుగా వారిని క్యాంపునకు తరలించినట్లు ప్రచారం సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లను తన కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఏకమైతే పూర్తి మెజార్టీ వచ్చి చైర్మన్‌ పీఠం దక్కించుకునే అవకాశం ఉంది.

రసవత్తరంగా క్యాంప్‌ రాజకీయాలు

నారాయణపేట, గద్వాలలో హైడ్రామా

ఒకరికొకరు చేదోడువాదోడుగా బీఆర్‌ఎస్‌, బీజేపీ

ఇచ్చిపుచ్చుకునే ధోరణితో రాయబారాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement