
బాల్యవివాహాలు చేయొద్దు
పాలమూరు: చిన్న వయస్సులో బాల్య వివాహం చేసుకోవడం వల్ల అమ్మాయిలకు అనారోగ్య సమస్యలతోపాటు చట్టపరమైన సమస్యలు ఎదువుతాయనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. జిల్లాకేంద్రంలోని జలజం జూనియర్ కళాశాలలో గురువారం చట్టాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి న్యాయమూర్తి హాజరై డ్రగ్స్, ఇల్లిసిట్ ట్రాఫికింగ్, బాలల హక్కులు, విద్యాహక్కు, పోక్సో యాక్ట్, ర్యాగింగ్ నిషేధ చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థి దశలో నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవడం వల్ల భవిష్యత్‌లో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మనకు కావాల్సిన న్యాయంపై ఎవరికి వారు పొందడానికి అవకాశం ఉంటుందన్నారు.
నేడు పెన్షన్ అదాలత్
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): పెన్షనర్లు, జీపీఎఫ్, అకౌంట్ సంబంధిత పెండింగ్ సమస్యలపై శుక్రవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పెన్షన్ అదాలత్, వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర గురువారం ఒక ప్రకనటలో తెలిపారు. రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ జిల్లా స్థాయిలో పెన్షన్ కమిటీల ద్వారా పెండింగ్ పెన్షన్ కేసులు త్వరితగతిన పరిష్కరించడానికి వీలుగా కలెక్టర్ల సమన్వయంతో పెన్షన్ అదాలత్, వర్కర్‌షాప్ నిర్వహించాలని ఆదేశించారన్నారు. మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలకు సంబంధించి దీర్ఘకాలిక పెన్షన్ కేసుల పరిష్కారంపై ఈ వర్క్‌షాప్ కొనసాగుతుందన్నారు. అలాగే పెన్షన్ చెల్లింపు ఆర్డర్లు, పీపీఓ, పీజీఎఫ్ అధికారాలు కూడా పంపిణీ చేస్తారన్నారు.
ఓపెన్ ఇంటర్, ఎస్సెస్సీ పరీక్ష ఫీజు చెల్లించండి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఓపెన్ ఇంటర్, ఎస్సెస్సీ ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ ఫీజులు చెల్లించాలని డీఈఓ ప్రవీణ్‌కుమార్, టాస్క్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ శివయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో పరీక్ష రాసి ఫెయిలైన వారు, అడ్మిషన్ పొంది పరీక్ష రాయలేని వారు ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 28 నుంచి వచ్చే నెల 5 వరకు చెల్లించాలని, అపరాధ రుసుంతో వచ్చే నెల 6 నుంచి 10 వరకు ఆన్‌లైన్‌లో చెల్లించాలన్నారు. పరీక్ష సెప్టెంబర్ 22 నుంచి 29 వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
35 అద్దె దుకాణాల సీజ్
● రూ.కోట్లల్లో పేరుకుపోయిన బకాయిలు
● కొరడా ఝుళిపించిన మున్సిపల్ అధికారులు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: స్థానిక క్లాక్‌టవర్ సమీపంలోని సుమారు 35 మున్సిపల్ అద్దె దుకాణాలను గురువారం ఆర్‌ఓ మహమ్మద్ ఖాజా ఆధ్వర్యంలో సీజ్ చేశారు. ఈ షాపుల నుంచి రూ.ఐదు కోట్లకు పైబడి బకాయిలు పేరుకుపోయాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాజాగా మున్సిపల్ రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లి అద్దె చెల్లించాలని దుకాణదారులకు హెచ్చరించినా స్పందించకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. కాగా రెండు, మూడు నెలల క్రితమే ఇదే విషయమై ఈ షాపులను సీజ్ చేసినా దుకాణదారులు కొంత గడువు కోరడంతో సరేనన్నారు. అయినప్పటికీ వారు అద్దె చెల్లించకపోవడం గమనార్హం. ఈ దాడుల్లో ఆర్‌ఐలు ముజీబుద్దీన్, రమేష్, అహ్మద్‌షరీఫ్, టి.నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

బాల్యవివాహాలు చేయొద్దు