
నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
గండేడ్: జిల్లాలో ఇందిరమ్మ లబ్ధిదారులు ఇళ్లను ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కట్టుకోవాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. గురువారం ఆమె మండలంలోని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న జానంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్లు ఎలా నిర్మించుకుంటున్నారు.. బిల్లులు ఎలా వస్తున్నాయి అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణం పూర్తి కావడానికి ఇంకా ఎంత ఖర్చు అవుతుందని ఆరాతీశారు. అలాగే పూర్తయిన ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు అయిందని ఓ లబ్ధిదారుడిని అడగగా ఇప్పటికే రూ.7 లక్షలు అయ్యాయని చెప్పారు. దీంతో కలెక్టర్ ఎక్కడ తెచ్చారు.. అప్పు చేశారా అని ప్రశ్నించారు. తల్లిదండ్రులు, తెలిసిన వారి వద్ద తీసుకున్నామని వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇళ్లు లేని వారికి గూడు కల్పించాలన్న ఉద్దేశంతో ఓ నమూనా ప్రకారం రూ.5 లక్షలతో పూర్తయ్యే విధంగా రూపొందించిందని, దాని ప్రకారమే ఇల్లు కట్టుకోవాలని సూచించారు. అలా కాకుండా నిర్మాణాలు చేసుకొని అప్పుల పాలు కావొద్దని హితవు పలికారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి.. పిల్లలు ఎంతమంది ఉన్నారు.. ఎలాంటి భోజనం పెడుతున్నారని ప్రశ్నిచారు. గ్రామంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసి.. వైద్యం కోసం వచ్చిన రోగులతో మాట్లాడారు. మెడికల్ ఆఫీసర్ చంద్రశేఖర్‌తో మాట్లాడి పలు సూచనలు చేశారు. కేజీబీవీకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాల ఆవరణలో ఓ మూలన ఉన్న రాళ్లు తొలగించాలని ఎంపీడీఓ హరిశ్చంద్రారెడ్డికి సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ భాస్కర్, తహసీల్దార్ మల్లికార్జున్‌రావు, ఎంఈఓ జనార్దన్, ఆర్‌ఐ యాసిన్, ఏపీఓ హరిశ్చంద్ర, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.