
ఆర్టీసీలో గ్రాడ్యుయేట్లకు శిక్షణ
నారాయణపేట రూరల్: ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీ సరికొత్త నిర్ణయాలతో ప్రజల మనస్సు చూరగొంటుంది. ఇందులో భాగంగా ఇంజినీరింగ్ అభ్యర్థులకు జాతీయ అప్రెంటిస్ పథకం ద్వారా శిక్షణ ఇవ్వాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణ సైతం మంగళవారం నుంచి ప్రారంభించింది.
మూడేళ్ల కోర్సు
ఇంజినీరింగ్ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి అప్రెంటిస్ షిప్ విధానం వరం లాంటిది. ఎంపికై న వారికి పని అనుభవంతో పాటు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు మూడేళ్ల కోర్సుగా దీన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా రెండు విభాగాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. సాధారణ డిగ్రీ పూర్తి చేసిన వారికి ట్రాఫిక్ సెక్షన్లో చేర్చుకుంటారు. మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన వారికి గ్యారేజీ విభాగంలో తీసుకుంటారు. ఎంపికై న అభ్యర్థులకు ట్రాఫిక్ సెక్షన్‌లో మొదటి సంవత్సరం నెలకు రూ.15 వేలు, గ్యారేజీ విభాగంలో రూ.17 వేలు అందిస్తారు. మూడేళ్ల పాటు సంవత్సరానికి రూ.వెయ్యి చొప్పున అదనంగా గౌరవ వేతనం ఇవ్వనున్నారు.
సేవల మెరుగునకు అవకాశం..
ప్రస్తుతం ఒక్కో డిపోలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల్లో ఇద్దరు చొప్పున ఉన్నారు. వారిలో ఒకరు మెకానికల్ విభాగం పర్యవేక్షిస్తుండగా.. మరొకరు ట్రాఫిక్ సెక్షన్ చూస్తుంటారు. పని భారం కారణంగా నిర్వహణ గాడి తప్పకుండా చూసుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. అప్రెంటిస్ విధానం అమలుతో ఆ సమస్య కొంతమేర తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు. అసిస్టెంట్ మేనేజర్లకు అప్రెంటిస్ అభ్యర్థులు తోడైతే మెకానికల్, ట్రాఫిక్ విభాగాల నిర్వహణ సులభతరం కానుంది. తద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించొచ్చు.
దరఖాస్తు ఇలా..
ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 27 లోగా ఆన్‌లైన్‌లో సంబంధిత వెబ్‌సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకొని మహబూబ్‌నగర్ రీజియన్‌ను ఎంపిక చేసుకోవాలి. అభ్యర్థులు 2021 విద్యా సంవత్సరం నాటికి ఇంజినీరింగ్, ఇతర డిగ్రీ కోర్సుల్లో ఉత్తీర్ణత పొంది సర్టిఫికెట్ ఉండాలి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న పత్రాలను మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కార్యాలయంలో అందజేయాలి. ఉమ్మడి జిల్లాలో మొత్తం పది డిపోల పరిధిలో ట్రాఫిక్ సెక్షన్‌లో పది, మెకానికల్ సెక్షన్‌లో ఎనిమిది పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ రీజియన్ లో 18మందికి అవకాశం లభిస్తుంది.
అప్రెంటిస్ విధానానికి
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
ట్రాఫిక్ సెక్షన్‌లో 10,
మెకానిక్ విభాగంలో 8 పోస్టులు
ఈ నెల 27వరకు గడువు
సద్వినియోగం చేసుకోవాలి
ఇంజినీరింగ్ అభ్యర్థులు ఆర్టీసీ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రీజియన్ పరిధిలో అన్ని డిపోల్లో అప్రెంటిస్ అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుంచి అర్హులను ఎంపిక చేసి డిపోలకు కేటాయిస్తారు. అన్ని అంశాల్లో నైపుణ్యం సాధించేలా శిక్షణకు ప్రణాళిక సిద్ధం చేశాం.
– సంతోష్‌కుమార్, ఆర్టీసీ ఆర్‌ఎం, మహబూబ్‌నగర్

ఆర్టీసీలో గ్రాడ్యుయేట్లకు శిక్షణ