రేషన్‌కార్డు.. పేదవాడి ఆత్మగౌరవం | - | Sakshi
Sakshi News home page

రేషన్‌కార్డు.. పేదవాడి ఆత్మగౌరవం

Jul 24 2025 7:08 AM | Updated on Jul 24 2025 7:08 AM

రేషన్‌కార్డు.. పేదవాడి ఆత్మగౌరవం

రేషన్‌కార్డు.. పేదవాడి ఆత్మగౌరవం

దేవరకద్ర రూరల్‌/చిన్నచింతకుంట: ప్రతి పేద కుటుంబం గుర్తింపు, ఆకలి తీర్చే ఆయుధం రేషన్‌కార్డు అని మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కౌకుంట్లలో పేదలకు మంజూరైన నూతన రేషన్‌కార్డులను బుధవారం ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డితో కలిసి మంత్రి పంపిణీ చేశారు. అంతకు ముందు రూ.1.30కోట్లతో 30 పడకల ఆస్పత్రి, రూ. 21లక్షలతో గ్రామపంచాయతీ భవనం, ఇస్రంపల్లిలో రూ. 32లక్షలతో ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ షేడ్‌ నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కౌకుంట్ల పాఠశాలలో నిర్మించిన తరగతి గదులను ప్రారంభించారు. చిన్నచింతకుంట మండలంలో రూ. 2.70కోట్లతో ఉంద్యాల తండాకు బీటీరోడ్డు, కురుమూర్తి స్వామి దేవస్థానంలో రూ. 74లక్షలతో చేపట్టనున్న రేకులషెడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలకు మంత్రి వాకిటి శ్రీహరి భూమిపూజ చేశారు. భక్తులకు తాగునీటి సౌకర్యార్థం రూ. 34లక్షలతో నిర్మించిన మంచినీటి సంపును ప్రారంభించారు. చిన్నచింతకుంట ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహాన్ని మంత్రి, ఎమ్మెల్యే ఆవిష్కరించి.. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో మంత్రి వాకిటి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే ద్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా రేషన్‌కార్డు ఇవ్వలేదని.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్‌కార్డు మంజూరు చేయడంతో పాటు ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు వంటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నిత్యం మంత్రివర్గంతో సమీక్షించి.. విద్య, వైద్యం, తాగు, సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించడంతో పాటు వసతిగృహాల విద్యార్థులకు కాస్మోటిక్‌ చార్జీలు పెంచామన్నారు. ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేసి ప్రతి విద్యార్థి బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాలన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో రూ. 100 కోట్లతో కోయిల్‌ సాగర్‌ ప్రాజెక్ట్‌ వద్ద మత్స్య పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం చిన్నచింతకుంట గంగాభవాని ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు.

● ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల కాలంలో తెలంగాణను బీఆర్‌ఎస్‌ నాయకులు అన్నిరకాలుగా ధ్వంసం చేశారన్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలో వస్తుందని.. మరోసారి మంత్రిగా శ్రీహరి, ఎమ్మెల్యేగా తాను ప్రజలకు సేవ చేస్తామని అన్నారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్‌, నర్సింహారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు నరేందర్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, కురుమూర్తిస్వామి ఆలయ చైర్మన్‌ గోవర్ధన్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీల చైర్మన్లు ప్రశాంత్‌కుమార్‌, కథలప్ప, రహిమత్‌తుల్ల, తహసీల్దార్‌ సుందర్‌రాజ్‌, ఎంపీడీఓ శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమం, అభివృద్ధికి అహర్నిశలు కృషి

మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement