
మాజీ సీఎం అచ్యుతానందన్ సేవలు చిరస్మరణీయం
వనపర్తి రూరల్: కామ్రేడ్ వీఎస్ అచ్యుతానందన్ స్ఫూర్తి నేటి యువతరానికి మార్క్సిస్టు పార్టీకి శిరోధార్యమని, ఆయన పోరాటాలు చిరస్మరణీయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని దాచలక్ష్మయ్య పంక్షన్‌హాల్‌లో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బాల్‌రెడ్డి అధ్యక్షతన 3వ రోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణా తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ వీఎస్ అచ్యుతానందన్ సోమవారం తిరువనంతపురం ఆస్పత్రిలో మృతిచెందగా.. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి సంతాపం తెలిపారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారీ సమాజం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నదన్నారు. ప్రధాని నరేంద్రమోడీ అమెరికాకు జూనియర్ భాగస్వామి కావడానికి తయారయ్యారని ఇది మనదేశ సార్వభౌమాధికారానికి ముప్పు తెస్తుందని విమర్శించారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. జిల్లా కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ.. జిల్లాల్లో వచ్చేమూడేళ్లలో జరగాల్సిన రాజకీయ కర్తవ్యాలను ప్రణాళికను పార్టీ ప్రజాసంఘాల విస్తరణకు కావాల్సిన కర్తవ్యాలను వివరించారు. కార్యక్రమంలో నాయకులు జబ్బారు, రాజు, గోపి, లక్ష్మి, ఆంజనేయులు, ఆర్‌ఎన్ రమేశ్, పరమేశ్వరాచారి, కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ