
చిరుతను పట్టుకునేందుకు ప్రత్యేక రెస్క్యూ బృందం
మహబూబ్‌నగర్ న్యూటౌన్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం తిర్మల్‌దేవుని గుట్ట, వీరన్నపేట గుర్రం గట్టు ఏరియాల్లో సంచరిస్తూ హడలెత్తిస్తున్న చిరుతను పట్టుకునేందుకు హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కు నుంచి ప్రత్యేక రెస్క్యూ బృందం శుక్రవారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఇదివరకే సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న పోలీసు, అటవీ శాఖలకు చెందిన బృందాలతోపాటు హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక రెస్క్యూ బృందం గాలింపును ప్రారంభించింది. సాయంత్రం వరకు ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో హైదరాబాద్ నుండి మరో రెండు బోన్‌లు తెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. శనివారం జిల్లాకు మరోరెండు బోన్‌లు తీసుకరానున్నారు. ఇదివరకే ఒక బోన్‌ను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు, డ్రోన్ సర్వేలైన్స్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్న అధికారులు తాజాగా ప్రత్యేక బృందం హైదరాబాద్ నుంచి రావడంతో చిరుత తప్పించుకునే ఆస్కారం లేదని అధికారులు పేర్కొంటున్నారు. గతనెల 30వ తేదీ నుంచి సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న అటవీశాఖ, పోలీసు శాఖలకు చెందిన బృందాలకు చిరుత పులి సవాల్ విసురుతోందనే చెప్పవచ్చు. ఒకవైపు సెర్చ్ నిర్వహిస్తుంటే మరోవైపు చిరుత కనిపించడం కలకలం రేపుతోంది. పరిసర ప్రాంతాల ప్రజలు భయాదోళనలకు గురవుతున్న నేపథ్యంలో అధికారులు అవగాహన కల్పిస్తూ భద్రతా చర్యలు చేపడుతున్నారు.
గాలింపు చర్యలు ప్రారంభం

చిరుతను పట్టుకునేందుకు ప్రత్యేక రెస్క్యూ బృందం