
శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు
ధరూర్/ఆత్మకూర్/దోమలపెంట/రాజోళి: ప్రియదర్శని జూరాల ప్రాజెక్టుకు ఒక్కసారిగా భారీగా వరద పెరిగింది. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ప్రవాహం 1.15 లక్షల క్యూసెక్కులుండగా.. 18 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. క్రస్టుగేట్లు, విద్యుదుత్పత్తి, ఎత్తిపోతల పథకాలకు కలిపి మొత్తం జూరాల నుంచి 1,06,213 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదైంది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు వరద జోరు కొనసాగుతున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 90 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 95,868 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుకు 89,074 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 33.319 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 90వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 25 క్రస్టు గేట్లను ఎత్తి 90,750 క్యూసెక్కుల నీటిని దిగువ ఉన్న జూరాలకు ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు.
కొనసాతున్న విద్యుదుత్పత్తి...
31 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, దిగువ 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు విద్యుదుత్పత్తి చేశారు.
● శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల స్పిల్‌వే ద్వారా 71,604 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 30,498, సుంకేసుల నుంచి 39,411 మొత్తం 1,41,513 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 881.2 అడుగుల వద్ద 194.7599 టీఎంసీల నీటి నిల్వ ఉంది. భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 32,478 మొత్తం 67,793 క్యూసెక్కుల నీటిని దిగువున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 20వేల క్యూసెక్కులు, ఎంజీకేఎల్‌ఐకు 1,600, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ లిఫ్టు ఇరిగేషన్ నుంచి 675 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 17.733 మి.యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 17.558 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు.

శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు