
సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యనందించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లా విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. సర్కారు బడులకు అన్నిరకాల మౌలిక వసతులు కల్పిస్తుందన్నారు. కేంద్రం నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే, యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్, పర్ఫార్‌మెన్స్ గ్రేడింగ్ ఇండికేటర్స్ సర్వే ప్రకారం 2021లో మెరుగైన విద్యలో రాష్ట్రం 36వ స్థానం నుంచి 2024లో పదిస్థానాలు మెరుగుపడి 26వ స్థానానికి చేరుకుందన్నారు. రానున్న పదేళ్లలో వన్ ట్రిలిమ్ ఎకానమిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేలా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. ఉమ్మడి జిల్లాను రాష్ట్రం నుంచి ముందుకు తీసుకుపోవాలన్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా చూడాలన్నారు. పదో తరగతి ఫలితాలు చూడకూండా ప్రతి మండలం, పాఠశాలల టీచర్, విద్యార్థి వారీగా విశ్లేషించాలన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు అత్యుత్తమ ఎక్స్‌లెన్సీ దిశగా పోవాలన్నారు. వందశాతం ఫలితాలు రాని సబ్జెక్స్ టీచర్లకు క్లస్టర్‌స్థాయిలో శిక్షణ ఇవ్వాలన్నారు. మండల అధికారులు తనిఖీల్లో గుర్తించిన లోపాలను 10, 15రోజుల్లో సరి చేసుకోవాలన్నారు. విద్యార్థుల సంఖ్య ప్రకారం టీచర్ నిష్పత్తి ఉండాన్నారు. విద్యార్థులను ఎన్‌రోల్‌మెంట్ యూడైస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోలైన విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా చూడాలన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో ఎన్‌రోల్‌మెంట్ పెరగడంపై అభినందిచారు. మూతపడి ఓపెన్ అయిన పాఠశాలలకు రూ.2లక్షల గ్రాంట్ అందజేస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రుల డిమాండ్ మేరకు రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశం పొందడానికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఫేసియల్ రికగ్నేషనల్ యాప్‌లో హాజరు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. 1.12లక్షల మంది ఉపాధ్యాయులకు డిజిటల్ ఎడ్యుకేషన్ అందించడానికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కేజీబీవీ విద్యార్థులు పదో తరగతిలో సాధించిన ఫలితాల కంటే మోడల్ స్కూల్‌లో చాలా తక్కువగా ఉందన్నారు. మోడల్ స్కూల్‌లో పాలమూరు జిల్లాలో 84శాతం ఉంటే నాగర్‌కర్నూల్‌లో 60శాతం ఉందన్నారు. మధ్యాహ్న భోజనం శాంపిల్స్ సేకరించి లాబ్‌కు పంపాలన్నారు. 250 పాఠశాలల్లో ఏఐ లాబ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ మాట్లాడుతూ.. కేజీబీవీల్లో టీచింగ్ ఖాళీలు ఉంటే వెయిటింగ్ లిస్టు నుంచి కలెక్టర్ ఆమోదంతో భర్తీ చేయాలన్నారు. కలెక్టర్ విజయేందిర బోయి మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో పదో తరగతి ఫలితాలు గతేడాదికంటే పెరిగిందన్నారు. అనంతరం ఓపెన్‌స్కూల్ సొసైటీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లాలోని ఎన్‌రోల్‌మెంట్‌లో పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించిన ఎంఈఓలను సన్మానించారు.
విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా
ఉమ్మడి జిల్లా విద్యాశాఖ అధికారులతో సమీక్ష