
ఆగిఉన్న లారీని ఢీకొన్న కంటైనర్
● లారీ డ్రైవర్ దుర్మరణం
మరికల్: ఆగిన ఉన్న లారీని కంటైనర్ ఢీకొనడంతో డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందిన ఘటన అర్ధరాత్రి 2గంటలకు పెద్దచింతకుంట వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. భూత్పూర్ మండలం కర్వేనకు చెందిన బోయ బాలకృష్ణ(34)మంగళవారం రాత్రి మహబూబ్‌నగర్ నుంచి రాయిచూర్‌కు లారీని తీసుకెళ్తుండగా మరికల్ మండలం పెద్దచింతకుంట స్టేజీ వద్దకు రాగానే టైర్ పంక్చర్ అయింది. రోడ్డు పక్కన నిలిపి లారీ కిందికి వెళ్లి టైర్ మారుస్తుండగా.. వెనుక నుంచి వచ్చిన కంటైనర్ లారీని ఢీకొట్టడంతో లారీ కింద ఉన్న డ్రైవర్ తలకు తీవ్రగాయలై అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కంటైనర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాము తెలిపారు.
పురుగుమందు తాగి యువకుడి బలవన్మరణం
వనపర్తి రూరల్: పెబ్బేరు పోలీస్‌స్టేషన్ పరిధిలో యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుందని ఎస్‌ఐ యుగేంధర్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా గుత్తి మండలానికి చెందిన రేవంత్‌కుమార్(27) డ్రైవర్. ఐదేళ్ల కిందట తండ్రి మృతిచెందగా.. అప్పటి నుంచి ఇంటి బాధ్యత తీసుకున్నాడు. మృతుడు ఈనెల 14న బొలేరోలో గుత్తి మార్కెట్ నుంచి పచ్చిమిర్చి లోడ్ వేసుకొని నిజామాబాద్‌కు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో 15న సాయంత్రం 7:20 గంటల సమయంలో మృతుడి తమ్ముడు కిరణ్‌కుమార్‌కు వీడియోకాల్ చేసి తాను చనిపోతున్నానని.. చేసిన అప్పుల వివరాలు ఇంట్లో ఉంచిన ఒక నోట్‌బుక్‌లో రాసిపెట్టాను.. పొలం అమ్మి అప్పులు కట్టమని.. అమ్మ జాగ్రత్త అని చెబుతూ వీడియోకాల్‌లో తమ్ముడు చూస్తుండగానే పురుగుల మందు తాగాడు. మృతుడి ఫోన్ లోకేషన్ ఆధారంగా పెబ్బేరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తకోట బైపాస్ వద్ద బొలేరోను గుర్తించి వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందాడు. మృతుడి తమ్ముడు కిరణ్‌కుమార్ బుధవారం పెబ్బేరు పోలీస్‌స్టేషలో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
కుక్కల దాడిలో 20 గొర్రెపిల్లలు మృతి
గట్టు: కుక్కల దాడిలో 20 గొర్రెల పిల్లలు మృతిచెందినట్లు గొర్రెల కాపరులు తెలిపారు. మాచర్లకు చెందిన గొర్రెల కాపరులు రాయచూర్ రామన్న, హనుమంతు, ఉరుకుందు, వీరేశ్‌కు చెందిన గొర్రెలను గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి పొలంలో నిలిపారు. పగటిపూట గొర్రెలను మేపడానికి మరో పొలానికి వెళ్లగా.., గొర్రె పిల్లలను వలలో వేసి వెళ్లారు. గొర్రెపిల్లలున్న చోట ఎవరు లేకపోవడతో కుక్కలమంద వలలోకి చొరపడి గొర్రెపిల్లలపై దాడి చేశాయి. కుక్కల దాడిలో 20 గొర్రెపిల్లలు మృతిచెందినట్లు కుర్వ వీరేశ్ తెలిపారు. వీటి విలువ రూ.లక్ష ఉంటుందని పేర్కొన్నారు.

ఆగిఉన్న లారీని ఢీకొన్న కంటైనర్