
శాంతియుతంగా పండగలు నిర్వహించుకోవాలి
వనపర్తి: శాంతియుతంగా పండగలు నిర్వహించుకోవాలని, డీజేలకు స్వస్తిపలకాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని గణేష్ మండపాల నిర్వాహకులు, డీజే యజమానులు, నిర్వాహకులు, జానపద కళాకారులు, చెక్కభజన మండలి, సాంస్కృతిక కళామండలి, భజన మండలి, కళాకారులతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి మాట్లాడారు. గణేష్ ఉత్సవాల్లో డీజేలను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా మారిందని.. శబ్ధ కాలుష్యం నుంచి కాపాడేందుకు డీజేల వినియోగంపై నిషేధాజ్ఞలు విధిస్తున్నామన్నారు. ముఖ్యంగా యువకులు డీజేలకు అలవాటు పడి తప్పతాగి చిందులేయడం ఫ్యాషన్‌గా మారిందని వివరించారు. డీజేలతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిషేధ ఉత్తర్వులను ఎవరైనా అతిక్రమిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తామని హెచ్చరించారు. శబ్ధ కాలుష్యాన్ని నివారించడానికి షేర్ బ్యాండ్, సన్నాయి, డిల్లెం బల్లెం, కోలాటం, చెక్కభజన, పండరి భజన, నృత్య ప్రదర్శనలతో ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. అనంతరం కళాకారుడు మీసాల రాము రాసిన ‘కలియుగం కలికాలం ఏమాయనో’ అనే పాట సీడీని ఎస్పీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవులు, కళాకారులను ఎస్పీ శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, డీఎస్పీ వెంకటేశ్వరరావు, వనపర్తి, ఆత్మకూర్ సీఐలు కృష్ణ, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, వనపర్తి పట్టణ, గోపాల్‌పేట ఎస్‌ఐలు హరిప్రసాద్, నరేష్, ట్రాఫిక్ ఎస్‌ఐ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.