
కేజీబీవీ భవనం పైనుంచి కిందపడిన బాలిక
కేటీదొడ్డి: కేజీబీవీ భవనం మొదటి అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఓ విద్యా ర్థిని గాయపడిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డిలో మంగళవారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సిబ్బంది కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం భూత్పూర్ గ్రామానికి చెందిన చెన్నయ్యగౌడ్ కూతురు సాయిశృతి కేటీదొడ్డి జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపీసీ చదువుతోంది. మంగళవారం ఉదయం బాలిక కళాశాల భవనం మొదటి అంతస్తులో తిరుగుతున్న క్రమంలో కళ్లు తిరిగి పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడింది. వెంటనే గమనించిన సిబ్బంది బాలికను గద్వాల జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆస్పత్రి సిబ్బంది బాలికకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. గద్వాల జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని డీఈఓ మహమ్మద్ అబ్ధుల్ గని, జిల్లా సెక్టోరియల్ అధికారి హంపయ్య, ఎంఈఓ వెంకటేశ్వరరావు, పరామర్శించారు. అనంతరం బాలికను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ పద్మావతి మాట్లాడుతూ సాయిశృతి ఇంటి విషయాలతో మానసికంగా కృంగిపోయిందని, ఉదయం నీరసంతో కళ్లు తిరిగి కిందపడిపోయినట్లు వివరించారు.