కొనసాగుతున్న వెంటిలేషన్ పునరుద్ధరణ
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పైకప్పు కూలిన ఘటనలో గల్లంతైన కార్మికుల ఆచూకీ మంగళవారం కూడా లభ్యం కాలేదు. సొరంగం లోపల డీ–2, డీ–1 ప్రదేశాల మధ్యన మట్టి తవ్వకాలు కొనసాగుతుండగా.. పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. నిషేధిత ప్రదేశం వరకు శిథిలాల తొలగింపు కొనసాగుతుండగా.. అక్కడి వరకు ఆక్సిజన్ అందించేందుకు వెంటిలేషన్ పునరుద్ధరణ పనులు కొనసాగిస్తున్నారు. టీబీఎం శకలాలు, బండరాళ్లను లోకో ట్రైన్‌లో, మట్టి, బురదను కన్వేయర్ బెల్టుపై బయటకు తరలిస్తున్నారు. నీటి ఊటను 150 హెచ్‌పీ మోటార్ల సాయంతో కృష్ణానదిలోకి వదులుతున్నారు. చిక్కుకున్న ఆరుగురి కార్మికుల జాడ రెండు, మూడు రోజుల్లో లభించే అవకాశం ఉందని సహాయక సిబ్బంది తెలిపారు.
డీ–2 ప్రదేశంలో తవ్వకాలు..
సొరంగంలో ప్రమాద ప్రదేశం డీ–2 సమీపంలో మట్టి తవ్వకాలు వేగంగా కొనసాగుతున్నాయని ప్రత్యేక అఽధికారి శివశంకర్ లోతేటి తెలిపారు. మంగళవారం జేపీ కార్యాలయంలో ప్రత్యేక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి కొనసాగుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. ఎస్కవేటర్లు, బాబ్ క్యాట్లు నిర్విరామంగా మట్టి తవ్వకాలు చేపడుతూ కన్వేయర్ బెల్టు ద్వారా సొరంగం బయటకు పంపుతున్నట్లు తెలిపారు. టీబీఎం మిషన్‌పై పేరుకుపోయిన బురదను వాటర్ జెట్‌ల సాయంతో తొలగించే ప్రక్రియ సమాంతరంగా కొనసాగుతుందని చెప్పారు. సహాయక సిబ్బంది రాత్రింబవళ్లు విరామం లేకుండా పనిచేస్తున్నారని, వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సమావేశంలో ఆర్మీ అధికారులు వికాస్‌సింగ్, విజయ్‌కుమార్, జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజినీర్ సంజయ్‌కుమార్ సింగ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎన్డీఆర్‌ఎఫ్ అధికారి గిరిధర్‌రెడ్డి, హైడ్రా అధికారి, దక్షిణ మధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఎల్‌బీసీలో కార్మికల జాడ కోసం
53 రోజులుగా అన్వేషణ


