పాలమూరు: జిల్లాలో క్షయవ్యాధి నియంత్రణ, రోగులకు చికిత్స అందించడంతో పాటు అన్ని విభాగాల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. క్షయ రోగులకు అందించిన సేవలకు గాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచినందుకు వైద్యాధికారులతో పాటు సిబ్బందిని అభినందించారు. గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు 2,087 క్షయ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి, 1,218 మందికి చికిత్స అందించి వ్యాధి తగ్గించినట్లు తెలిపారు. 1,767 మంది రోగులకు నెలకు రూ.వెయ్యి చొప్పున ఆరు నెలల పాటు ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో క్షయ నియంత్రణ కోసం 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం ద్వారా డిసెంబర్ 7 నుంచి మార్చి 24 వరకు రెండు మొబైల్ వ్యాన్‌ల ద్వారా లక్షణాలు ఉన్నవారికి తేమడ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. క్షయ పరీక్షలు చేయడానికి డీఎఫ్‌ఎంటీ నిధుల ద్వారా పోర్టబుల్ ఎక్స్‌రే మిషన్ కోసం రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో క్షయ లక్షణాలు బాధితులు సమీప పీహెచ్‌సీలు, సబ్ సెంటర్‌లలో చికిత్స తీసుకోవాలన్నారు. ఆనంతరం క్షయ నియంత్రణ కోసం ప్రత్యేక ప్రతిజ్ఞ చేయడం జరిగింది. సమావేశంలో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మెహన్‌రావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ కృష్ణ, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.