పావుగంటలో ఇంటికి చేరతామనగా.. | - | Sakshi
Sakshi News home page

పావుగంటలో ఇంటికి చేరతామనగా..

Dec 3 2024 1:07 AM | Updated on Dec 3 2024 12:05 PM

-

ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం

అక్కాతమ్ముడిని కబళించిన మృత్యువు

మరో నలుగురికి తీవ్ర గాయాలు

అబ్దుల్లాపూర్‌మెట్‌: మరో 15 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనుకున్న అక్కా తమ్ముడిని మృత్యువు కబళించింది. ఓఆర్‌ఆర్‌పై అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. 

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లె గ్రామానికి చెందిన ఎరగదిండ్ల మనోజ్‌ (25) అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం పెద్దఅంబర్‌పేట మున్సిపల్‌ పరిధిలోని కుంట్లూర్‌కు చెందిన తన అక్క చల్లా పద్మ (31), బావ వెంకటేశ్‌, మేన కోడళ్లు గంగ, యమున, మేనల్లుడు చల్లా అర్జున్‌ను తీసుకుని సోమవారం ఉదయం వనపర్తి నుంచి కారులో కుంట్లూర్‌కు బయలుదేరాడు. మార్గమధ్యలో ఔటర్‌ రింగ్‌రోడ్డుపై కోహెడ –పెద్దఅంబర్‌పేట మార్గంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న కారుకు.. ముందు అతి వేగంగా వెళ్తున్న లారీని డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేక్‌ వేశాడు. 

దీంతో కారు లారీని వెనుకవైపు నుంచి బలంగా ఢీకొట్టాడు. లారీలో కారు ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో మనోజ్‌తో పాటు పద్మ అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా వానిరి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికీ తరలించారు. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement