సభ బందోబస్తుకు వెళ్లి వస్తూ..మార్గం మధ్యలో పోలీసు వాహనం బోల్తా

- - Sakshi

నాగర్‌కర్నూల్‌ క్రైం: కొల్లాపూర్‌లో ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభ బందోబస్తుకు వెళ్లి వస్తున్న పోలీసు వాహనం బోల్తా పడటంతో ముగ్గురు మహిళా హోంగార్డులకు తీవ్రగాయాలయ్యాయి. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్న ఆర్‌ఎస్‌ఐ శివాజీతో పాటు హోంగార్డు తిరుపతి, కొత్తకోటలో పనిచేస్తున్న హోంగార్డు జయంతి, మదనాపురంలో పనిచేస్తున్న హోంగార్డు మంజుల, మహబూబ్‌నగర్‌ పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌లో పనిచేస్తున్న హోంగార్డు అన్నపూర్ణ కొల్లాపూర్‌లో ఆదివారం బందోబస్తుకు వెళ్లారు.

సభ అనంతరం తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు దేశిటిక్యాల సమీపంలో వారి వాహనం బోల్తాపడింది. జయంతి, మంజుల, అన్నపూర్ణలకు తీవ్రగాయాలయ్యాయి. హోంగార్డు తిరుపతి, ఆర్‌ఎస్‌ఐ శివాజిలకు స్వల్పగాయాలు కావడంతో స్థానికులు అంబులెన్స్‌ ద్వారా జనరల్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

జయంతి, మంజుల పరిస్థితి విషయంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహేందర్‌ తెలిపారు. జయంతి ఏడాది కూతురు కూడా పోలీసు వాహనంలో ఉన్నప్పటికి స్వల్పగాయాలతో బయట పడింది.

తమ్ముడిపై అన్న కత్తితో దాడి: తమ్ముడు మృతి
బాలానగర్‌: క్షణికావేశంలో ఓ అన్న సొంత తమ్ముడిపై కత్తితో దాడి చేయగా తమ్ముడు మృతి చెందిన ఘటన మండలంలోని పెద్దరేవళ్లిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని పెద్దరేవళ్లికి చెందిన బైండ్ల శేఖర్‌పై రెండేళ్ల క్రితం తమ్ముడు కుమార్‌ (35) దాడిచేశాడని అదే కోపంతో శనివారం రాత్రి ఇరువురి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది.

మళ్లీ దాడిచేస్తాడనే అనుమానంతో కూరగాయల కత్తితో తమ్ముడు కుమార్‌పై అన్న దాడి చేశాడు. తీవ్ర గాయాలు కాగా షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా ఆదివారం తెల్లవారు జామున మృతి చెందాడు. మృతుని తల్లి బైండ్ల మణెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు.

Read latest Mahabubnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top