సాక్షి, మహబూబాబాద్: పేదోడి సొంత ఇంటి కల నెరవేర్చేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. జిల్లాకు రూ.287.24కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో జిల్లా వ్యాప్తంగా 5,415 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించాల్సి ఉంది. అయితే ఇందులో ఇప్పటి వరకు 2,773ఇళ్లు పూర్తికాగా.. 1,798 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించారు. ఇందులో 1,728 కుటుంబాలు ఇళ్లలోకి చేరగా.. 975 ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ నిరుపయోగంగానే ఉన్నాయి. మిగిలిన 2,542 ఇళ్లు అసంపూర్తిగానే ఉన్నాయి.
ముఖం చాటేసిన కాంట్రాక్టర్
డబుల్‌బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపడుతామని ఒప్పందం కుదుర్చుకున్న కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయకుండానే ముఖం చాటేశాడు. లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చే డబ్బులకు తోడు ఒక్కో లబ్ధిదారుడి నుంచి అదనంగా రూ.2లక్షలకు పైగా వసూలు చేశాడు. మరికొన్ని గ్రామాల్లో నాయకులకు రూ. 20వేల నుంచి రూ. 50వేల వరకు ముట్టచెప్పామని లబ్ధిదారులు చెబుతున్నారు. అయితే పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ లబ్ధిదారులు ఇచ్చిన డబ్బులు తీసుకొని నిర్మాణాలు చేపట్టాడు. జిల్లాలోని కొన్ని ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టగా.. మరికొన్ని గ్రామాల్లో లబ్ధిదారుల సొంత స్థలంలో నిర్మాణం ప్రారంభించారు. స్లాబ్ లెవల్ వరకు కొన్ని, పిల్లర్లు, బేస్‌మెంట్ వరకు మరికొన్ని నిర్మించి వదిలి పెట్టాడు. అయితే ప్రభుత్వ స్థలంలో నిర్మించి ఇళ్ల పరిస్థితి అలాగే ఉన్నా. ఇల్లు పీకి కొత్త ఇల్లు కట్టుకోవాలని ఆశపడిన వారు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు.
మొండిగోడలపై గోనెబస్తాలు,
పాత చీరలు కట్టుకొని..
డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరు కావడంతో నిర్మాణం కోసం పాత ఇళ్లు కూల్చివేశారు. కొత ఇళ్లు స్లాబ్‌పోసి కాంట్రాక్టర్ వదిలేశాడు. దీంతో ఐదు సంవత్సరాలుగా లబ్ధిదారులు గోడలు, పిల్లర్ల మధ్యలో గోనె సంచులు, పాత చీరలు కట్టుకొని ఉంటున్నారు. మరికొందరు ఇంట్లో ఉన్న బర్రెలు, బంగారం అమ్ముకొని, ఇంకొందరు గిరిగిరి, ఇతర ప్రైవేట్ ఫైనాన్స్, డ్వాక్రా రుణాలతో వచ్చిన డబ్బులతో గోడలు పెట్టుకున్నారు. అప్పులు తీర్చేందుకు కొన్ని కుటుంబాలు గ్రామం విడిచి హైదరాబాద్, విజయవాడ, వరంగల్, ఖమ్మం వంటి పట్టణాలకు వలస వెళ్లి పనిచేసుకొని వచ్చిన డబ్బులతో కిస్తీలు కడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘ఈ ఫొటోలోని మహిళ కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన వడ్లకొండ ధనమ్మ. ఐదు సంవత్సరాల క్రితం అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్ బెడ్రూం ఇల్లు పొందేందుకు అర్హత సాధించింది. ప్రభుత్వం ఇచ్చే డబ్బులకు రూ.2లక్షల అదనంగా ఇస్తే ఇల్లు మంచిగా నిర్మిస్తానని కాంట్రాక్టర్ నమ్మబలికాడు. దీంతో ముందుగా రూ.1.5లక్షలు ఇచ్చింది. పాత ఇల్లు కూల్చి కొత్త ఇల్లు నిర్మాణం చేపట్టారు. స్లాబ్ లెవల్ వరకు పనులు చేపట్టి బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్ ముఖం చాటేశాడు. దీంతో పుస్తెల తాడు అమ్ముకొని గోడలు పెట్టుకొని అసంపూర్తి ఇంట్లో ఉంటున్నారు.’
మొండిగోడల్లో బస్తా సంచులు,
పాత చీరలు కట్టుకొని జీవనం
డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం
పాత ఇళ్లు కూల్చివేత
కాంట్రాక్టర్‌కు ఒక్కో ఇంటికి
రూ.2లక్షలకు పైగా ఇచ్చిన లబ్ధిదారులు
అసంపూర్తి నిర్మాణాలతో ముఖం
చాటేసిన కాంట్రాక్టర్
ఐదేళ్లుగా అవస్థలు పడుతున్న పేదలు
అసంపూర్తి నిర్మాణాలకోసం కొత్త ప్రణాళిక
జిల్లాలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కొత్త ప్రణాళిక రూపొందిస్తుంది. ఇందుకోసం జీఓ నంబర్ 5 ద్వారా డబుల్ బెడ్రూం ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లుగా మార్చి నిర్మాణాలు పూర్తి చేస్తాం. ఇప్పటికే వివరాలు సేకరించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే నిర్మాణాలు మొదలు పెడతాం. బిల్లులు వసూళ్లు చేసి నిర్మాణాలు ఆపివేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటాం.
–పురుషోత్తం,
ఇన్‌చార్జ్ హౌసింగ్ ప్రాజెక్టు అధికారి


