మహబూబాబాద్: మానుకోట పట్టణంలో ముంపు ప్రాంతాల్లో వరద కాల్వల నిర్మాణం చేపట్టనున్నారు. ఈమేరకు రూ.12 కోట్లు కేటాయించగా.. పనులకు అగ్రిమెంట్ పూర్తయింది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. నీటి పారుదలశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులు చేయనున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ ఈనెల 22న సంబంధిత అధికారులతో ఆ స్థలాలను పరిశీలించి ఫైనల్ చేశారు.
గతంలో కొన్ని..
వర్షాకాలంలో మానుకోటలోని పలు ప్రాంతాలు కొద్దిపాటి వర్షానికే ముంపునకు గురవుతున్నాయి. కాగా, గతంలో బస్తీదవాఖాన ఎదుట, బ్రహ్మకుమారీస్ మందిరం సమీపం, పీఎస్‌ఆర్ గార్డెన్ సమీపం, రాహుల్ నగర్‌లో మేజర్ వరద కాల్వలు, వాటితో పాటు సుమారు 10 మైనర్ వరద కాల్వల నిర్మాణం చేశారు. ప్రస్తుతం మరిన్ని నిర్మాణం చేయనున్నారు.
రూ.12కోట్ల కేటాయింపు..
మానుకోట ఎమ్మెల్యే మురళీనాయక్ మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ నుంచి రూ.59 కోట్లు విడుదల చేయించారు. కాగా, వాటిలో రూ.12 కోట్లు వరద కాల్వలు కోసం కేటాయించారు.
వరద కాల్వ లు నిర్మాణం జరిగే ప్రాంతాలివే..
● బంధం చెరువు నుంచి పాషివాగు నుంచి జనాల చెరువు వరకు 835 మీటర్ల మేర వరద కాల్వ నిర్మాణం చేస్తారు.
● జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్ సమీపంలో ఉన్న సెవెన్ హిల్స్ నుంచి బంధం చెరువు వరకు 805 మీటర్ల మేర నిర్మాణం చేయనున్నారు.
● నర్సంపేట ఎన్‌హెచ్ బైపాస్ నుంచి గుండ్లకుంట చెరువు వరకు 100 మీటర్ల వదర కాల్వ నిర్మాణం.
● జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీ నుంచి నిజాం చెరువు వరకు 700 మీటర్ల కాల్వ.
● హస్తినాపురం నుంచి నిజాం చెరువు వరకు 250 మీటర్ల కాల్వ, సిగ్నల్ కాలనీ నుంచి రైల్వేట్రాక్ కింది నుంచి నిజాం చెరువు వరకు 400 మీటర్ల వదర కాల్వ. నిజాం చెరువు నుంచి రాబంద్రుచెరువు వరకు 436 మీటర్లతో కాల్వ నిర్మాణం చేయనున్నారు.
చెరువులకు అనుసంధానం..
వరద కాల్వలను చెరువులకు అనుసంధానం చేస్తారు. దీంతో నీరు వృథా కాదు, భూగర్భ జలాలు పెరుగుతాయి. ముంపు ప్రాంతాలు జలమయం కావు. చెరువులకు అనుసంధానం చేయనుండటంతో నీటిపారుదలశాఖ అధికారుల సూచనలు, సలహాల ప్రకారం నిర్మాణం చేయనున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఆ స్థలాలకు ఇరిగేషన్ అధికారుల నిర్ణయం మేరకు మార్కింగ్ చేశారు.
ఏడాది గడువు..
వరదకాల్వల పనులను ఏడాదిలోపు పూర్తి చేయాల్సి ఉంది. కాగా ఈనెలలోనే పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నారు. పనులు పూర్తయితే ఆయా ప్రాంతాల్లో ముంపు సమస్య తీరుతుంది.
ముంపు ప్రాంతాల గుర్తింపు
మానుకోట పట్టణంలోని స్నేహనగర్, రామన్నపేట కాలనీ, మన్మదతోట ప్రాంతం, గుండ్ల కుంట కాలనీ, జమాండ్లపల్లిలో కొంతభాగం, బంధం చెరువు ప్రాంతం ప్రధానమైన ముంపు ప్రాంతాలుగా గుర్తించారు. వీటితో పాటు జగ్జీవన్‌రావు నగర్ కాలనీ, ఏల్ నగర్ కాలనీ, ధర్మన్న కాలనీ శివారు కొంతభాగం (కృష్ణస్వామి కుంట), ఏటి గడ్డ తండా, సిగ్నల్ కాలనీలో కొంతభాగం, తదితర ప్రాంతాలను ముంపు ప్రాంతాలుగా గుర్తించారు. వర్షాకాలంలో ఆయా ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలో కసరత్తు చేస్తున్నారు.
కాల్వలతో సమస్య తీరుతుంది
వరద కాల్వల నిర్మాణాలతో ముంపు సమస్య తీరుతుంది. వాటిని చెరువులకు లింకు చేయడం వల్ల నీరు వృథా కాదు. మళ్లీ నిధులు విడుదల కాగానే మిగిలిన ముంపు ప్రాంతాల్లో కూడా నిర్మాణాలు చేస్తాం. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఉండేలా చూస్తూ గడువులోపు పూర్తి చేస్తాం.
–ఎం.వినోద్‌కుమార్, మున్సిపల్ కమిషనర్
రూ.12కోట్లు కేటాయింపు..
అగ్రిమెంట్ పూర్తి
ముంపు ప్రాంతాల్లో
త్వరలోనే పనులు ప్రారంభం
ఆ కాల్వలు చెరువులకు అనుసంధానం
ఇరిగేషన్ అధికారుల సమన్వయంతో పనులు


