మత్తు పదార్థాలతో యువత నిర్వీర్యం | - | Sakshi
Sakshi News home page

మత్తు పదార్థాలతో యువత నిర్వీర్యం

Jun 27 2026 12:37 AM | Updated on Jun 27 2026 12:37 AM

డీఎస్పీ ఎన్‌.తిరుపతిరావు

మహబూబాబాద్‌ రూరల్‌ : మత్తు పదార్థాలతో యువత నిర్వీర్యం అవుతుందని, యువత మత్తువదిలి మంచిగా బతకాలని డీఎస్పీ నంబూరు తిరుపతిరావు పిలుపునిచ్చారు. మహబూబాబాద్‌ సబ్‌ జైలులో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీఎస్పీ తిరుపతిరావు హాజరై జైలులోని ఖైదీలచే డ్రగ్స్‌ వ్యతిరేక ప్రతిజ్ఞను చేయించి మాట్లాడుతూ.. డ్రగ్స్‌ అనేవి యువతను నిర్వీర్యం చేస్తూ వారి భవిష్యత్‌ను అంధకారం చేస్తున్నాయని, నేర అవి నీతి రహిత సమాజమే తెలంగాణ పోలీసుల లక్ష్యమని పేర్కొన్నారు. డ్రగ్స్‌, గంజాయిలాంటి మత్తు పదార్థాలు ఏరూపంలో ఉన్నా, సేవించినా, ఇతరులకు అమ్మినా, రవాణా చేసినా తీవ్ర నేరంగా పరిగణిస్తామని హెచ్చరించారు. డ్రగ్స్‌ బారినపడిన యువత తీవ్ర నేరాలకు పాల్పడుతుండటంతో వారి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని వాపోయారు. డ్రగ్స్‌ మహమ్మారిని తుదముట్టించేందుకు పోలీసు శాఖ తీవ్రంగా కృషి చేస్తుందని, ఇందులో భాగంగా గంజాయి సాగు, అమ్మకంతో పాటు ఉపయోగించే వారిపై నిరంతరం పోలీసుల నిఘా ఉంటుందని హెచ్చరించారు. డ్రగ్స్‌ నిర్మూలనలో ప్రజలు భాగస్వామ్యం కావాలని, పోలీసులకు సమాచారం ఇచ్చినవారికి రూ.5 వేల పారితోషకం కూడా ఉంటుందని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. అనంతరం గంజాయితో పాటు వివిధ నేరాలకు పాల్పడిన ఖైదీలకు ప్రత్యేకంగా సూచనలు, సలహాలతో కౌన్సిలింగ్‌ ఇచ్చారు. కార్యక్రమంలో జైలర్‌ మల్లెల శ్రీనివాసరావు సిటిజన్‌ ఫోరం సభ్యులు శంతన్‌ రామరాజు, జైలు సిబ్బంది ఖలీల్‌, లక్ష్మన్‌, వీరన్న, జనార్దన్‌, రామాంజనేయులు, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement