బయ్యారం: ఖరీఫ్‌లో ప్రభుత్వం సూచించిన వరి సన్న రకాలు సాగు చేస్తేనే బోనస్ చెల్లిస్తారని డీఏఓ విజయచంద్ర సూచించారు. మండలంలోని కొత్తపేట రైతువేదికలో నిర్వహిస్తున్న విత్తన మేళాను ఆయన సందర్శించి మాట్లాడారు. వరిపంటలో యూరియా వినియోగాన్ని తగ్గించి సమతుల్య ఎరువుల వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని, నానో యూరియా వాడాలని రైతులకు సూచించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.
పంటమార్పిడితో అధిక దిగుబడులు..
గార్ల: పంట మార్పిడి విధానం ద్వారా భూమి సారవంతం కావడంతో పాటు, పంటల్లో అధిక దిగుబడులు సాధించవచ్చని డీఏఓ విజయచంద్ర సూచించారు. శుక్రవారం గార్లలోని రైతు వేదికలో కొనసాగుతున్న విత్తన మేళాను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, ఖరీఫ్‌లో సాగు విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు మేలైన విత్తనాలు ఎంచుకొని యాజమాన్య పద్ధతులను అవలంభించడం, వ్యవసాయ అధికారుల సూచనలు పాటించడం వల్ల పంటల్లో దిగుబడులు పెరుగుతాయన్నారు. ఏఓ కావటి రామారావు, ఏఈఓలు, డీలర్లు, రైతులు పాల్గొన్నారు.


