వేతన వెతలు! | - | Sakshi
Sakshi News home page

వేతన వెతలు!

Jun 26 2026 6:16 AM | Updated on Jun 26 2026 6:16 AM

కూరగాయలు కొందామంటే పైసల్లేవు

పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న. నాకు నెలకు రూ.17,300 జీతం వస్తుంది. గత ఆరునెలలుగా జీతాలు రాక కూరగాయలు కొనుక్కుందామంటే పైసల్లేవు. స్కూళ్లు ప్రారంభమయ్యాయి. పిల్లలకు నోట్‌ బుక్స్‌, బ్యాగులు కొందామంటే డబ్బులు లేవు. అధికారులు స్పందించి జీతాలు ఇప్పించాలి.

– రఘుపతి, కంప్యూటర్‌ ఆపరేటర్‌,

నర్సింహులపేట

పెండింగ్‌ జీతాలు అందించాలి

ఐదు నెలలుగా జీతాలు వస్తలేవు. ఏజెన్సీ నిర్వాహకులను అడిగితే సమస్య ఉందని చెబుతున్నారు. ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ నిర్వాహకులకు ఫోన్‌ చేస్తే స్పందించడం లేదు. అప్పులతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. ఆర్థిక ఇబ్బందుతో నలిగిపోతున్నాం. అధికారులు పెండింగ్‌ వేతనాలు ఇప్పించి తమకు న్యాయం చేయాలి.

–కొమురయ్య, ఫిజికల్‌ డైరెక్టర్‌,

నెల్లికుదురు మోడల్‌ స్కూల్‌

మహబూబాబాద్‌ అర్బన్‌: సకాలంలో వేతనాలు అందక ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని 8 మోడల్‌ స్కూళ్లలో పీడీ, కంప్యూటర్‌ ఆపరేటర్‌, నైట్‌ వాచ్‌ మెన్‌, అటెండర్‌ విధులు నిర్వహిస్తున్నారు. ఐదు నెలలుగా జీతాలు రాకపోవడంతో వారు గోసపడుతున్నారు. ఏజెన్సీ నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తున్నారని, అప్పుల తెచ్చి కుటుంబాలను నెట్టుకొస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఐదు నెలలుగా పెండింగ్‌లో..

జిల్లాలో 8 మోడల్‌ స్కూళ్లలో ఔట్‌సోర్సింగ్‌ విధానంలో 34 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. పీడీలకు నెలకు రూ. 28,935 కాగా, రూ.22,750 మాత్రమే అందిస్తున్నారు. కంప్యూటర్‌ ఆపరేటర్లకు రూ.19,500లకు రూ. 17,300, నైట్‌ వాచ్‌మమెన్‌, అటెండర్లకు రూ. 15,600లకు బదులు రూ.13,000 అందిస్తూ పీఎఫ్‌, ఈ ఈఎస్‌ఐ పేరుతో కట్‌ చేస్తున్నారు.

రెన్యూవల్‌ తేల్చడంలో తాత్సారం.

ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని ఏటా సాధారణంగా ఏప్రిల్‌లో రెన్యూవల్‌ చేయాల్సి ఉంటుంది. కానీ, ఇప్పటి వరకు ఆ ప్రక్రియ జరగలేదు. అలాగే ఒక్కరికి కూడా పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించలేదు. వేతనాలు ఎందుకు చెల్లించడం లేదని సదరు ఏజెన్సీల నిర్వాహకులను ప్రశ్నించే సిబ్బందికి సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేస్తున్నారని పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. కాగా అర్హత లేని ఏజెన్సీలకు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల బాధ్యతలు అప్పగించడంతో వేతనాలు చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు

అందని జీతాలు

ఐదు నెలలుగా పెండింగ్‌

జిల్లాలో 8 మోడల్‌ స్కూళ్లలో 34 మంది

నిర్లక్ష్యంగా ఏజెన్సీ నిర్వాహకులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement