నెహ్రూసెంటర్: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వైద్య ఆరోగ్యశాఖ, డీఎంఈ, టీవీవీపీ విభాగాల్లో బదిలీల ప్రక్రియ పూర్తికావొస్తుంది. ఒకచోట 4 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులందరూ ఇటీవల నిర్వహించిన కౌన్సిలింగ్‌లో ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. ప్రొఫెసర్లు, డాక్టర్లు, స్టాఫ్‌నర్సులు, సీనియర్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది బదిలీపై వెళ్లారు. దీంతో ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో విధులు నిర్వహించిన ఉద్యోగులకు స్థానచలనం తప్పలేదు. అయినప్పటికీ కొందరు ఉద్యోగులు బదిలీపై వెళ్లకుండా.. ఒక విభాగం నుంచి మరో విభాగానికి డిప్యుటేషన్ల ఉత్తర్వులు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే విధంగా ఇప్పటి వరకు వారు కొనసాగిన స్థానంలోనే ఉండేలా పైరవీలు సైతం ప్రారంభించినట్లు సమాచారం.
ఏళ్లుగా తిష్ట..
ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అయినప్పటికీ.. కొంత మంది వారికి అనుకూలమైన ప్రాంతంలోనే ఉద్యోగం చేసేలా పైరవీలు, డిప్యుటేషన్ ద్వారా తిష్ట వేయాలని చూస్తున్నారు. 4 ఏళ్లు పూర్తి చేసుకున్న వారిని బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా.. పైరవీలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ నెల చివరి వరకు బదిలీ అయిన స్థానంలో రిపోర్టు చేయాల్సి ఉండగా.. ఈ లోపు శాఖల్లో ఉన్న లోటుపాట్లను అడ్డం పెట్టుకుని మళ్లీ స్థానికంగా కొనసాగేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో పాటు మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు కూడా బదిలీలు చేయాల్సి ఉండగా.. కేవలం కొంది మంది ఉద్యోగులకే బదిలీ కావడంతో పూర్తిస్థాయిలో బదిలీలు చేపట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు.
పైరవీలు..
కొంది మంది ఉద్యోగులు స్థానికంగా ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా ఇక్కడ నుంచి వెళ్లకుండా ఉండేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పోస్టింగ్‌ల కోసం హైదరాబాద్‌లో పైరవీలు చేయడంతో పాటు డిప్యుటేషన్లు, ఇతర పద్ధతుల్లో యథావిధిగా కొనసాగేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వ్యవహారంపై ప్రభుత్వం, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
జీఎంసీ ప్రిన్సిపాల్ బదిలీ..
మహబూబాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ లకావత్ వెంకట్ బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో ఇప్పటి వరకు ఎవరు బాధ్యతలు చేపట్టలేదు. ప్రిన్సిపాల్‌తో పాటు ప్రొఫెసర్లు, నాలుగేళ్లు పూర్తి చేసుకున్న వారందరికీ బదిలీలు తప్పలేదు. ఈ నెల చివరి వరకు బదిలీల ప్రక్రియ ఓ కొలిక్కి రానుంది.
వైద్యశాఖలో ఎట్టకేలకు ట్రాన్స్‌ఫర్స్
ఏళ్లుగా ఒకేచోట తిష్టవేసిన
కొందరు ఉద్యోగులు
పాత స్థానాల్లోనే పని చేసేందుకు
పైరవీలు


