కాలం కలిసొచ్చేనా..? | - | Sakshi
Sakshi News home page

కాలం కలిసొచ్చేనా..?

Jun 26 2026 6:16 AM | Updated on Jun 26 2026 6:16 AM

మొక్కజొన్న సాగుపై ఏజెన్సీ రైతుల

సందిగ్ధం

వర్షాలు సరిగా లేక ఆందోళన

బయ్యారం: జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో ఏటా వానాకాలం సీజన్‌లో మొక్కజొన్న పంట సాగు చేసే రైతుల్లో సందిగ్ధత నెలకొంది. ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటి వరకు మోస్తరు వర్షం కూడా పడకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయ్యారం, గంగారం, కొత్తగూడ, గూడూరు, గార్ల, మహబూబాబాద్‌ మండలాల పరిధి ఏజెన్సీ ప్రాంతాల్లోని రైతులు గత కొన్ని సంవత్సరాలుగా ఖరీఫ్‌లో వానలపై ఆధారపడి మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ప్రతీ వానాకాలం వర్షాలు అనుకూలంగా పడుతుండడంతో కాలం కలిసొచ్చి పంటలు పండేవి. అయితే ఈ ఏడాది వర్షాలు సరిగా లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

వానలు లేక మొదలు కాని దుక్కులు..

గత ఏడాది మే చివరలో ఆశాజనకంగా వానలు కురవడంతో జూన్‌ మొదటివారంలోనే వర్షాధారంగా మొక్కజొన్న పంట సాగు చేసే రైతులు దుక్కులు సిద్ధం చేసుకొని జూన్‌ చివరి నాటికి విత్తనాలు విత్తా రు. ఈ ఏడాది ఇప్పటి వరకు కొన్నిచోట్ల మినహా మిగతా ప్రాంతాల్లో ఆశాజనకమైన వానలు కురవకపోవడంతో దుక్కులు దున్నని పరిస్థితి ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వర్షాధారిత భూముల్లో పంటల సాగుపై ఆశలు వదులుకోవాల్సి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు.

ఆ తరువాత ముఖం చాటేస్తే..

మరికొన్ని రోజుల్లో భారీ వర్షం కురుస్తే పంట సాగుకు దుక్కులు దున్ని విత్తనాలు విత్తొచ్చు. మొక్కజొన్నకు పంట విత్తే సమయంలోనే దుక్కిదున్నే కూళ్లు, విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులకు ఎకరానికి రూ.20 వేల వరకు రైతులు భరించాల్సి వస్తుంది. సాగు చేసిన పంటలో ఒకసారి కలుపుమందు పిచికారీ చేయటంతో పాటు మూడు దఫాలుగా యూరియా వేస్తే మూడు నెలల తరువాత పంట చేతికి వస్తుంది. పంట సాగు చేసిన నాటి నుంచి మూడు నెలల వ్యవధిలో పది నుంచి పదిహేను రోజుల పాటు వానలు పడకపోతే పంట ఎండిపోయే పరిస్థితి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు.

వానలు ఏం చేస్తాయోనని

భయం అవుతోంది

ఈ ఏడాది ఇప్పటి వరకు పెద్దవాన పడలేదు. చిన్నవానలకు కొద్దిగా దుక్కి చేశాం. వానలు పడితేనే పండే భూముల్లో ఇప్పుడు మొక్కజొన్నలు విత్తితే వానలు ఏం చేస్తాయోనని భయం అవుతుంది.

– బి.విశ్వనాథం, మొట్లతిమ్మాపురం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement