● రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
ఏటూరునాగారం: ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని ఆకులవారి ఘణపురం ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను మంత్రి సీతక్క కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి గురువారం సందర్శించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో హాస్టల్‌లో నూతనంగా చేరిన విద్యార్థినుల వివరాలను తెలుసుకుని వసతి గృహంలోని మరుగుదొడ్లు, వంటశాల, తరగతి గదులు, విద్యార్థులకు అందుతున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం గోదావరి నది ప్రవాహ పరిస్థితులు, కరకట్ట భద్రత, వరదల సమయంలో నది కరకట్ట దెబ్బతినకుండా చేపడుతున్న రక్షణ చర్యలను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. మ్యాప్ ఆధారంగా గోదావరి ప్రవాహ తీరు, కరకట్ట పరిస్థితులు, జియో ట్యూబ్స్ ఏర్పాటు విధానం, చేపడుతున్న రక్షణ చర్యలపై పూర్తి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభమైన ప్రతీ ఏడాది గోదావరి వరదలతో ఏటూరునాగారం, రామన్నగూడెం, మంగపేట, అకినేపల్లి మల్లారం, ఓడగూడెం తదితర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతుందన్నారు. మంగపేట, రామన్నగూడెం ప్రాంతాల్లో వరద ఉధృతి గ్రామాలపై ప్రభావం చూపకుండా జియో ట్యూబ్స్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతీ ఏడాది వరదల సమయంలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించే పరిస్థితి రాకుండా దీర్ఘకాలిక, శాశ్వత రక్షణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కొండాయి వద్ద బ్రిడ్జి పిల్లర్లు పూర్తి కాగా గడ్డర్ల నిర్మాణం పనులు సాగుతున్నాయని తెలిపారు. ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ కల్యాణి, గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు ఫిరంగి, డీఈఓ సిద్ధార్థ రెడ్డి, ఇరిగేషన్ డీఈ ప్రవీణ్, ఆత్మ కమిటీ చైర్మన్ రఘు, బ్లాక్ అధ్యక్షుడు వెంకన్న పాల్గొన్నారు.


