మహబూబాబాద్: క్షేత్రస్థాయిలో సమగ్ర అభివృద్ధి కోసం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా ప్రత్యేక అఽధికారి, జెన్‌కో సీఎండీ హరీశ్ అన్నారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం ప్రజాపాలన ప్రగతి– ప్రణాళిక 99రోజుల కార్యక్రమంపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. ప్రణాళిక కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. గుర్తించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. కొన్ని విషయాల్లో పలు శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో భూసార పరీక్షలు నిర్వహించి అనువైన పంటలు, అధిక లాభాలు కలిగిన పంటలు సాగే చేసే విధంగా అవగాహన కల్పించాలన్నారు. టాస్క్ శిక్షణ కేంద్రం ద్వారా యువతకు శిక్షణ ఇవ్వాలన్నారు. యూ రియా తగ్గించి నానో యూరియా వాడే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించామన్నారు. జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు.


