ఆదరణ అంతంత మాత్రమే! | - | Sakshi
Sakshi News home page

ఆదరణ అంతంత మాత్రమే!

Jun 26 2026 6:16 AM | Updated on Jun 26 2026 6:16 AM

హన్మకొండ: పీఎం కుసుం పథకంలో సోలార్‌ప్లాంట్‌ ఏర్పాటు చేసుకుంటే చెల్లించే యూనిట్‌ ధరపై ఇప్పటికే రైతులు పెదవి విరుస్తుండగా.. ఉరుము ఉరిమి మీదపడిన చందంగా డిస్కంలు రైతులకు చెల్లించే యూనిట్‌ ధరను తగ్గించాలని నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. యూనిట్‌ కాస్ట్‌ తక్కువగా ఉందని సోలార్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి చాలా మంది ముందుకు రాలేదు. పీఎం కుసుం పథకం కింద యూనిట్‌ ధర రూ.3.13 చెల్లిస్తామని డిస్కం పీపీఏ (పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌) చేసుకుంది. ప్లాంట్‌కు ఉపయోగించే ఉపకరణాలపై జీఎస్‌టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ప్లాంట్‌ ఏర్పాటు వ్యయం తగ్గుతున్న క్రమంలో యూనిట్‌ కాస్ట్‌ తగ్గించాలని డిస్కంలు నిర్ణయం తీసుకున్నాయి. రూ.3.13 నుంచి రూ.2.98కి అంటే 15 పైసలు తగ్గించాలని కోరుతూ టీజీ ఎన్పీడీసీఎల్‌ తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలిలో పిటిషన్‌ వేసింది. దీనిపై జూలై 8న బహిరంగ విచారణ చేపట్టాలని ఈఆర్‌సీ నిర్ణయం తీసుకుంది. ఈనెల 30 వరకు ఈఆర్‌సీ అభ్యంతరాలు స్వీకరిస్తుంది. బహిరంగ విచారణ తర్వాత ఈఆర్‌సీ ఏ నిర్ణయం తీసుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది.

టీజీ ఎన్పీడీసీఎల్‌ పరిధిలోని 18 జిల్లాలో మొత్తం 2098 మంది 2,788.900 మెగావాట్ల సోలార్‌ప్లాంట్‌ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 520 మంది రైతులు 683.800 మెగావాట్లకు రూ. లక్ష చొప్పున ఈఎండీ చెల్లించారు. పీపీఏ మాత్రం 643 మెగావాట్లకు 447 మంది రైతులు చేసుకున్నారు. వేలల్లో దరఖాస్తులు వస్తే వందల్లో మాత్రమే పీపీఏలు చేసుకోవడాన్ని చూస్తే రైతులు డిస్కంలు చెల్లించే రేటుపై విముఖత ఉన్నట్లు అర్థమవుతోంది. గిట్టుబాటు కాని ధర.. రుణవాయిదాలు 12 ఏళ్ల వరకు చెల్లించాల్సి రావడం.. 25 ఏళ్ల వరకు యూనిట్‌ రేట్‌ పెంచకపోవడం వంటి కారణాలతో రైతుకు ప్రయోజనం లేకపోవడం.. ఈఎంఐలు చెల్లించడం ఇబ్బంది కావొచ్చనే ఆలోచన.. రైతు వాటాగా రూ.లక్షల్లో చెల్లించాల్సి రావడం.. ప్రతీ నెల ఆదాయం నిలకడగా వస్తుందనే నమ్మకం లేకపోవడం వెరసి సోలార్‌ప్లాంట్‌ ఏర్పాటుపై విముఖత వ్యక్తమైంది. దరఖాస్తులు చేసిన నాటి ఉత్సాహం ఈఎండీ చెల్లింపులో కనిపించలేదు. ఈఎండీ చెల్లించడంలో కనిపించిన శ్రద్ధ పీపీఏ చేసుకోవడంలో లేదు. పీపీఏ చేసుకున్న వారందరు కూడా సోలార్‌ప్లాంట్‌ ఏర్పాటు అంశంపై సందిగ్ధంలో పడ్డారు. దీంతో 447 మంది 643 మెగావాట్లకు పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్లకు 18 మెగావాట్ల 9 సోలార్‌ ప్లాంట్లు పూర్తికావడం చూస్తే రైతుల్లో విముఖతకు నిదర్శనం. రైతుల నుంచి ఆశించినస్థాయిలో స్పందన రాకపోవడం, ప్రాజెక్టులో పురోగతి మందగించడంతో విద్యుత్‌ కొనుగోలు ధర తగ్గింపు ప్రతిపాదనపై ఈఆర్‌సీ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. రైతులు ఆగ్రహంగా ఉన్నారని తెలిసి కూ డా డిస్కంలు ఈఆర్‌సీకి 15 పైసలు తగ్గింపు కోరు తూ పిటిషన్‌ దాఖలు చేయడం వెనుక ఉద్దేశమేమిటో అర్థం కావడం లేదని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే తక్కువగా ఉన్న ధరను మరింత తగ్గిస్తే పథకం అమలుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆసక్తి కనబరచని రైతులు

యూనిట్‌కు 15 పైసలు తగ్గించాలని డిస్కంల నిర్ణయమే కారణం

ఈఆర్‌సీలో పిటిషన్‌ దాఖలు చేసిన టీజీ ఎన్పీడీసీఎల్‌

దరఖాస్తులు 2,098..

పీపీఏ చేసుకున్నది 447 మంది

ఇప్పటి వరకు పూర్తయిన సోలార్‌ప్లాంట్లు 9 మాత్రమే

సోలార్‌ పవర్‌ను ప్రోత్సహించేందుకు పీఎం కుసుం..

కేంద్ర ప్రభుత్వం సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి పెంచేందుకు, సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై రైతులను ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి కిసాన్‌ ఉర్జా సురక్షా ఎవం ఉత్థాన్‌ మహాభియాన్‌ (పీఎం కుసుం) పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధానంగా రైతులను సౌర విద్యుత్‌ ఉత్పత్తి వైపు ప్రోత్సహిస్తోంది. రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వ నరుల అభివృద్ధి సంస్థ, టీజీ ఎన్పీడీసీఎల్‌, టీజీ ఎ స్‌పీడీసీఎల్‌ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement