దాచుకున్న డబ్బులు మాయం! | - | Sakshi
Sakshi News home page

దాచుకున్న డబ్బులు మాయం!

Jun 26 2026 6:16 AM | Updated on Jun 26 2026 6:16 AM

కొత్తగూడ : పోస్టాఫీస్‌లో దాచుకున్న డబ్బు మాయమైంది. ఖాతాదారుకు తెలియకుండా ఆ సొమ్ము డ్రా చేశారు. దీంతో బాధితురాలు లబోదిబోమంటోంది. బాధితురాలి కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండల కేంద్రానికి చెందిన ఏంపెల్లి సందీప్‌(25) గత సంవత్సరం అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడికి భార్య రచన, ఏడాది వయసున్న పాప ఉంది. ఆ నిరుపేద కుటుంబ పెద్ద దిక్కు కోల్పోయిందని పలువురు దాతలు తమకు తోచిన మేర ఆర్థిక సాయం అందించారు. ఇలా వచ్చిన డబ్బును రచన పేరుతో పోస్టల్‌ అకౌంట్‌ ప్రారంభించి సెప్టెంబర్‌ 09, 2025న డిపాజిట్‌ చేశారు. అకౌంట్‌లో ఉన్న డబ్బును ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేద్దామని బాధితులు గురువారం పోస్టాఫీస్‌కు వెళ్లింది. ఈ క్రమంలో అకౌంట్‌లో ఉన్న డబ్బు నుంచి డిసెంబర్‌ 27, 2025న రూ.లక్షా 99 వేలు డ్రా చేసినట్లు ఉందని ప్రస్తుత మేనేజర్‌ తెలిపాడు.అయితే తాను డ్రా చేయలేదని, డిపాజిట్‌ చేసినప్పటి నుంచి నేటి వరకు పోస్టాఫీస్‌కు రాలేదని బాధితురాలు కన్నీరుమున్నీరైంది. డ్రా చేసిన సమయంలో మేనేజర్‌ బదిలీ అయ్యాడని, తనకు ఏమీ తెలియదని ప్రస్తుత మేనేజర్‌ సమాధానం ఇచ్చాడు. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు సిద్ధమైంది.

మధ్యవర్తులతో మంతనాలు..

బదిలీపై వెళ్లిన పోస్టాఫీస్‌ మేనేజర్‌కు విషయం తెలియగానే మధ్య వర్తుల ద్వారా బాధితురాలిని ఫిర్యాదు చేయకుండా మంతనాలు నిర్వహించినట్లు సమాచారం. తన డబ్బులు మేనేజర్‌ డ్రా చేసినట్లు అంగీకరించి డ్రా చేసిన మొత్తానికి మరి కొంత డబ్బు అదనంగా ఇచ్చేందుకు చర్చలు జరిపినట్లు తెలిసింది. కాగా, ఆ మొత్తాన్ని మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి వద్ద ఉంచినట్లు సమాచారం. విషయం బయట పడింది కాబట్టి ఎక్కువ సొమ్ము ఇచ్చాడని, ఇంకా బయటకు రాని ఎంతమంది డబ్బులు ఇలా వినియోగించుకున్నాడో అనే చర్చ సాగుతోంది. చిన్న పాప కోసం దానం చేసిన డబ్బులు కాజేసిన మేనేజర్‌ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.

పోస్టల్‌ అకౌంట్‌ నుంచి ఖాతాదారుకు తెలియకుండా రూ.1.99లక్షలు డ్రా

విషయం బయటకు రావడంతో

మధ్యవర్తులతో మంతనాలు

ఫిర్యాదు చేయకుండా

ఎక్కువ డబ్బుల ఆశ

ఇంకా ఎన్ని అకౌంట్ల నుంచి

తీశారోనని అనుమానాలు

మేనేజర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి

నిరుపేద ఆదివాసీ బిడ్డకు దాతలు సాయం చేసిన డబ్బులు కాజేసిన పోస్టల్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ పై కఠిన చర్యలు తీసుకోవాలి. అతడు పని చేసిన కాలంలో ఇంకా ఎంత మంది డబ్బులు వినియోగించుకున్నాడో విచారణ చేపట్టాలి. లేదంటే ప్రజలకు బ్యాంకులపై నమ్మకం పోతుంది.

–సందీప్‌, తుడుందెబ్బ నాయకుడు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement